Ysrtp
YSRTP: తెలంగాణ రాజకీయాలలో మరో జెండా ఆవిష్కృతం కానుంది. రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ పుట్టుకొస్తుంది. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తండ్రి పేరుతో ఓ పార్టీ తీసుకురానున్నారు. వైఎస్ఆర్ తెలంగాణగా ఇప్పటికే ఈ పార్టీకి నామకరణం చేయనున్నట్లుగా ఖరారు కాగా ఈరోజు గురువారం తన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా, అజెండాను స్వయంగా షర్మిల ఈ సాయంత్రం వెల్లడించనున్నారు.
రాజన్న సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమంటూ తెలంగాణ రాజకీయాల్లో రంగ ప్రవేశం చేసిన షర్మిల.. ఇప్పటికే జిల్లాల వారీగా తండ్రి అనుచరులతో సమావేశాలు నిర్వహించి మొత్తానికి నేడు రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు. ముందుగా ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేయనున్న షర్మిల కడప నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం బేగంపేటకు చేరుకోనున్నారు. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కళాకారులు ఆమెకు స్వాగతం పలకనున్నారు.
ఇక, పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ కేంద్రానికి చేరుకోనున్న షర్మిల.. ఐదు గంటలకు వేదికపైన తెలంగాణ అమరవీరుల స్తూపానికి, వైఎస్ విగ్రహానికి నివాళి అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం మాట్లాడనున్న షర్మిల పార్టీ స్థాపన లక్ష్యాలు, అజెండాపై వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో తల్లి వైఎస్ విజయమ్మ, భర్త అనిల్‌కుమార్, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలితో పాటు ఇప్పటి వరకు తన పార్టీలో కోర్ టీంగా ఉన్న వారు కూడా పాల్గొననున్నారు.