Thummala Nageswara Rao : రాజకీయ చాణక్యుడు, అభివృద్ధి ప్రధాత తుమ్మల.. ఎన్టీఆర్ నుంచి రేవంత్ రెడ్డి కేబినెట్ వరకు.. రాజకీయ చరిత్రలోనే అరుదైన గుర్తింపు..

Thummala Nageswara Rao : ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తుమ్మల నాగేశ్వరరావు గ్రామీణ జీవితపు కష్టాలను దగ్గరగా చూసి పెరిగారు. ప్రజల కష్టాలను తొలగిస్తూ.. అభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్యంగా రాజకీయాల్లో కొనసాగుతూ 40ఏళ్లు రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న తుమ్మల.. ప్రజల మనిషిగా.. అభివృద్ధి ప్రధాతగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన నేతగా అన్ని వర్గాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

Tummala Nageswara Rao

Thummala Nageswara Rao : పదవులు చాలా మందికి వస్తాయి.. కానీ, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించే నాయకులు మాత్రం అరుదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో అలాంటి అరుదైన పేరు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రజల మనిషిగా పేరుపొందిన తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లోకి వచ్చి 40ఏళ్లు. ఆయన రాజకీయ ప్రస్తానంలో ఎన్నో మైలురాళ్లను అదిరోహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ కేబినెట్ నుంచి నారా చంద్రబాబు నాయుడు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ మంత్రిగా కొనసాగుతూ.. ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా తుమ్మల ఉన్నారు.

Also Read : Gold Imports : బంగారం, వెండి ప్రియులకు బిగ్ షాకిచ్చిన కేంద్రం.. దిగుమతి సుంకాన్ని భారీగా పెంపు..

ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన తుమ్మల నాగేశ్వరరావు గ్రామీణ జీవితపు కష్టాలను దగ్గరగా చూసి పెరిగారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించిన ఆ యువకుడు, 1980లలో నందమూరి తారక రామారావు పిలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలిచిన మలుపు. దమ్మపేట మండలం గండుగుల పల్లి గ్రామం నుంచి గ్రామ గ్రామానికి తిరుగుతూ, ప్రజలతో మమేకమవుతూ, పార్టీకి బలమైన కేడర్‌ను నిర్మిస్తూ ఆయన ముందుకు సాగారు. రాజకీయాలను అధికారానికి మార్గంగా కాదు… ప్రజాసేవకు వేదికగా చూసిన ఆయనకు ప్రజలు కూడా అండగా నిలిచారు.

ఉమ్మడి రాష్ట్రంలో జలగం వెంగళరావు హవా నడుస్తున్న కాలం అది. ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్, కేంద్ర మంత్రిగా జలగం వెంగళరావు ఖమ్మం జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించారు. అదే ప్రాంతం నుండి యువ నాయకుడుగా రాజకీయ అరంగేట్రం చేశారు తుమ్మల నాగేశ్వరరావు. సత్తుపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల, 1986 మే 14న ఎన్టీఆర్ కేబినెట్‌లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన ప్రయాణం అభివృద్ధి దిశగా మరింత వేగంగా సాగింది.

వాగులు, వంకలు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు.. రైతు జీవితాన్ని మార్చే ప్రతి అంశంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. “రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది” అనే భావనతో పనిచేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పలు కీలక శాఖలను నిర్వహిస్తూ పరిపాలనా దక్షతను చాటుకున్నారు. మైనర్ ఇరిగేషన్ నుంచి ఆర్ అండ్ బీ వరకు.. ఎక్కడ పనిచేసినా తనదైన ముద్ర వేశారు. అయితే, ఆయన ప్రత్యేకత కేవలం పరిపాలనలోనే కాదు.. ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధంలో ఉంది. గ్రామాల్లో చిన్న కార్యక్రమం జరిగినా హాజరవడం, కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం, రైతు కష్టాలపై వెంటనే స్పందించడం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత దగ్గర చేసింది.

2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కే. చంద్రశేఖర్ రావు కేబినెట్‌లో ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల.. రహదారుల అభివృద్ధికి కొత్త రూపం ఇచ్చారు. సూర్యాపేట–దేవరపల్లి హైవే నుంచి ఖమ్మం రింగ్ రోడ్ వరకు.. ఆయన ఆలోచనల్లో అభివృద్ధి పరుగులు తీసింది. భక్తరామదాస్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, వైరా లింక్ కెనాల్ వంటి సాగునీటి పథకాల ద్వారా వేలాది ఎకరాలకు నీరు అందేలా కృషి చేశారు. అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు.. రైతు పొలంలో నీరు చేరడమని ఆయన నమ్మకం. ఖమ్మం పట్టణ అభివృద్ధిలో కూడా ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. మున్నేరు కేబుల్ బ్రిడ్జి, ఆధునిక మార్కెట్, రింగ్ రోడ్, క్రీడా మౌలిక వసతులు.. ఇవన్నీ ఆయన అభివృద్ధి దృక్పథానికి నిదర్శనాలు.

2023లో రేవంత్ రెడ్డి కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు, నాలుగు మంది ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అరుదైన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. అయితే ఆయన అసలైన బలం పదవులు కాదు.. ప్రజల ప్రేమ. రక్తదాన శిబిరాలు, పేద విద్యార్థులకు సహాయం, మొక్కలు నాటే కార్యక్రమాలు, రైతుల సమస్యల పరిష్కారం.. సేవ అనే పదానికి ఆయన జీవితం అర్థం చెబుతుంది. 1986లో ప్రారంభమైన ఈ రాజకీయ ప్రయాణం, 2026 నాటికి 40ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఉద్యమం నుంచి అభివృద్ధి దిశగా సాగిన ఈ ప్రస్థానం, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడి కథగా మారింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావు అభిమానులు, నేతలు భారీ ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేసి, పాలాభిషేకాలు, ర్యాలీలు, సభలతో హోరెత్తిస్తున్నారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేశారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ నాటి మిత్రులు, పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో సభను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివస్తుండటంతో ఖమ్మం నగరం రాజకీయ సందడితో కళకళలాడుతోంది.