ప్రాణాలకు తెగించి ప్లాంట్ ను కాపాడాలనుకున్నారు….

  • Publish Date - August 21, 2020 / 09:57 PM IST

ప్రాణాలకు తెగించి పవర్ ప్లాంట్ ను కాపాడాలనుకున్నారు. మంటలను పూర్తిస్థాయిలో కంట్రోల్ చేస్తే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లదని భావించారు. కానీ వారి ప్రాణాలకే ప్రమాదం అనే విషయాన్ని గమనించలేకపోయారు. చివరి వరకు మంటలను కంట్రోల్ చేసే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారు. డీఈ, ఏఈతోపాటు మిగిలిన సిబ్బంది కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

పరిస్థితి చేజారిపోయి మంటలు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టడంతో వారు బయటికి రాలేక ప్రాణాలు కోల్పోయారు. 9 మంది అధికారులు ఒక్కసారిగా ప్రాణాలను కోల్పోయారు. పవర్ ప్లాంట్ కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టారు.

శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లుగా జెన్కో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయినట్లు ప్రకటించింది. మంటలార్పేందుకు ఉద్యోగులు విశ్వప్రయత్నం చేశారని తెలిపింది. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్లాంట్ ను కాపాడారని జెన్కో పేర్కొంది. దట్టమైన పొగ వల్ల సిబ్బంది బయటకు రాలేకపోయారని చెప్పింది.

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలోని శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొదటి యూనిట్ లో పెద్ద శబ్దాలతో పేలుడు సంభవించింది. తొలుత ప్యానెల్ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి జల విద్యుత్ కేంద్రం మొత్తం వ్యాపించాయి.

భారీగా మంటలు చెలరేగడం, దట్టంగా పొగలు అలుముకోవడంతో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో 17 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో కొంతమంది మహిళా ఉద్యోగులున్నట్లు సమాచారం. సొరంగమార్గం ద్వారా 8 మంది సురక్షితంగా బయటకు వచ్చారు.

మిగిలిన 9 మంది లోపలే చిక్కుకుపోయారు. తెల్లవారుజాము నుంచి సహాయక చర్యలు కొనసాగుతుండగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఏఈ సుందర్ నాయక్ మృతదేహాన్ని గుర్తించారు. ఆ తర్వాత మరో ఎనిమిది మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది. మృతుల కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.

శ్రీశైలం పవర్ హౌజ్ అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అధికారిగా అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అగ్నిప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణ నష్టంపై సీఎం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని ప్యానల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతోనే ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు రెస్క్యూ సిబ్బంది ఎనిమిది మృతదేహాలను వెలికితీయగా మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలిపింది.

మృతులు డీఈ శ్రీనివాస్ (హైదరాబాద్), ఏఈలు సుందర్ (సూర్యపేట), వెంకట్ (పాల్వంచ), ఉజ్మఫాతిమా, మోహన్ కుమార్ (హైదరాబాద్), జూనియర్ ప్లాంట్ అటెండెర్ కిరణ్, బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేశ్, మహేశ్ (హైదరాబాద్)గా గుర్తించారు.