మార్పులపై రగడ.. జయ జయహే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు.. మళ్లీ కంపోజ్ చేయించడంపై వివాదం

Telangana Formation Day: తెలంగాణ గీతాన్నీ మళ్లీ కంపోజ్ చేయించడం, అందులో కీరవాణి స్వరాలు సమకూరుస్తుండటం..

తెలంగాణ ఏర్పడి దశాబ్దం పూర్తయిన వేళ… రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అయ్యింది. ఉత్సవాలకు రేవంత్‌ సర్కార్‌ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న ఉదయం అమరవీరులకు ముఖ్యమంత్రి నివాళులర్పించి.. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే అవతరణ ఉత్సవాల్లో పాల్గొంటారు.

రాష్ట్ర ప్రత్యేక గీతంతో పాటు అధికారిక నూతన చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రముఖ తెలంగాణ కవి అందె శ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. తెలంగాణ గీతాన్నీ మళ్లీ కంపోజ్ చేయించడం, అందులో కీరవాణి స్వరాలు సమకూరుస్తుండటం వివాదాస్పదమవుతోంది. తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జ‌య‌జ‌య‌హే తెలంగాణ‌ పాట‌ను కంపోజ్ చేసేందుకు తెలంగాణ సంగీత దర్శకులు ఎవరు లేరా అని ప్రశ్నిస్తోంది. ఈపాట తెలంగాణ ఆత్మగౌర‌వమన్న TCMA.. కీర‌వాణి మ్యూజిక్ చేయ‌డం తమతో పాటు తెలంగాణ ప్రజలను అవ‌మాన ప‌ర్చడ‌మేనని తెలిపారు.

ప్రవీణ్‌ కుమార్‌ అభ్యంతరం
మరోవైపు తెలంగాణ గీతానికి కీరవాణి సంగీతాన్ని అందించడంపై BRS నేత RS ప్రవీణ్‌ కుమార్‌ అభ్యంతరం తెలిపారు. అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లు గడిచాక.. గీత స్వర కల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చిందని RS ప్రవీణ్‌ ట్వీట్ చేశారు.

తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కాలమన్న ఆయన.. కీరవాణి స్వరకల్పన చేయడానికి నాటు నాటు పాట కాదని ఘాటుగా స్పందించారు. ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్‌లో స్పందించారు. రాష్ట్ర గీత రూపకల్పన బాధ్యతలు అందె శ్రీకి ఇచ్చామని సీఎం చెప్పారు.

అందె శ్రీ ఎవరిని ఎంచుకొని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమని, ఏ సంగీత దర్శకుడిని పెట్టి చేయాలనేది తన పని కాదని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలోనూ రేవంత్ సర్కార్‌ మార్పులు చేర్పులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక పాలనకు గుర్తులని, వాటిని తొలగిస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ చిహ్నం రూపకల్పన బాధ్యతను నిజామాబాద్ వ్యక్తికి అప్పగించారు.

తెలంగాణ పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, రాష్ట్ర గీతం ఉండేలా చిహ్నం ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి రాష్ట్ర చిహ్నంలో నుంచి కాకతీయ తోరణం, చార్మినార్‌ను తొలగించడం ఖాయంగా కనిపిస్తుంది. దీనిపైనా వివాదం చెలరేగుతోంది. కాకతీయ తోరణం తొలగించడాన్ని… వరంగల్ జిల్లా ప్రజలు, నేతలు వ్యతిరేకిస్తున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చార్మినార్‌ను తొలగించడాన్ని MIM వ్యతికేస్తోంది.

కీరవాణి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సంగీత దర్శకుడు.. ఆయనను విమర్శించే హక్కు మీకు లేదు: ఎమ్మెల్యే నాగరాజు

ట్రెండింగ్ వార్తలు