Supreme Court: రూ.20 లంచం కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం తీర్పు.. ఉద్యోగుల విడుదల
కేవలం రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణపై ముప్పై ఏళ్లుగా సాగిన సుదీర్ఘ న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు(Supreme Court) ఎట్టకేలకు ముగింపు పలికింది.
- V Santhosh Kumar
- Published on- August 20, 2026 / 09:45 AM IST
Supreme court acquits government employees in 20 rupees bribe case
- రూ.20 లంచం కేసు కొట్టివేత
- 30 ఏళ్లకు ఉద్యోగుల విముక్తి
- సుప్రీంకోర్టు సంచలన తుది తీర్పు
Supreme Court: కేవలం రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణపై ముప్పై ఏళ్లుగా సాగిన సుదీర్ఘ న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు(Supreme Court) ఎట్టకేలకు ముగింపు పలికింది. గుజరాత్ ప్రభుత్వంలోని ఒక గుమాస్తా, చప్రాసీపై మోపిన అభియోగాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. లంచం డిమాండ్ చేసినట్లు సరైన ఆధారాలు లేకుండా కేవలం డబ్బులు చేతులు మారినంత మాత్రాన నేరం నిరూపితం కాదని జస్టిస్ ఉజ్జల్ భూయన్, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్‌ల బెంచ్ స్పష్టం చేసింది. 1996లో ప్రారంభమైన ఈ కేసులో కింది కోర్టుల తీర్పులను పక్కనపెడుతూ కోర్టు తీర్పునిచ్చింది.
విచారణలో బయటపడిన తీవ్ర వైరుధ్యాలు:
ఆనంద్ జిల్లాలోని బెచరి గ్రామ పంచాయతీలో ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం వచ్చిన ఒక విద్యార్థి నుంచి గుమాస్తా రూ.100, చప్రాసీ రూ.20 లంచం కోరారని ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే దాడుల్లో చప్రాసీ వద్ద రూ.20 దొరకగా, గుమాస్తా వద్ద ఎలాంటి సొమ్ము లభించలేదు. దీనికి తోడు విచారణ సమయంలో బాధితుడి వాంగ్మూలాల్లో తీవ్ర వైరుధ్యాలు కనిపించాయి. పండుగ సందర్భంగా చప్రాసీకి ఇచ్చే చిన్నపాటి కానుకగా ఆ మొత్తాన్ని భావించవచ్చని, అతడు నేరుగా లంచం కోరలేదని క్రాస్ ఎగ్జామినేషన్‌లో స్వయంగా ఫిర్యాదుదారే అంగీకరించడంతో అభియోగాల ప్రామాణికత దెబ్బతింది.
ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసిన సర్వోన్నత న్యాయస్థానం:
1999లో ట్రయల్ కోర్టు విధిలించిన శిక్షను 2015లో గుజరాత్ హైకోర్టు సమర్థించినప్పటికీ, సుప్రీంకోర్టు మాత్రం ఆ తీర్పులను కొట్టివేసింది. గుమాస్తాపై విచారణకు అనుమతి ఇచ్చిన అధికారి అర్హత కూడా చట్టబద్ధంగా లేదని కోర్టు గమనించింది. సందేహాలకు తావులేకుండా నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని వ్యాఖ్యానిస్తూ, 30 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ ఇద్దరు ఉద్యోగులకు పూర్తి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది.
