సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు.. బదిలీ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

ఓటుకు నోటు కేసులో విచారణ బదిలీ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరో రెండు వారాలు వాయిదా వేసింది.

Supreme Court

Vote Note Case : ఓటుకు నోటు కేసులో విచారణ బదిలీ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరో రెండు వారాలు వాయిదా వేసింది. సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా.. న్యాయవాదులు, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని ఇంటర్ లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా పోలీసు అధికారులను బెదిరించేలా వ్యవహరించారని మరోసారి న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం హోం మంత్రి హోదా కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నదని, కేసు ముందుకు తీసుకెళ్ళాల్సిన అధికారులు ప్రతిరోజు ఆయనకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పిటిషనర్ జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఒకవేళ మరోచోటుకు విచారణ మార్చితే కూడా.. అధికారులు ఆయనకు చెప్పిన తర్వాతే కోర్టుకు వెళతారు కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అప్పుడు జ్యురిస్డిక్షన్ మారుతుందని న్యాయవాదులు తెలిపారు.

Also Read : కృష్ణా నది వరద ఉధృతి.. వైఎస్ జ‌గ‌న్‌కు విజయవాడ కృష్ణలంక వాసుల కృతజ్ఞతలు..

విచారించే కోర్టు మారినా పరిధి మారదు, విషయం మారదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇప్పటికే 25 మంది సాక్షులు నుంచి అన్ని వివరాలు నమోదు అయ్యాయని తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత శుక్రవారం కోర్టుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పడంతో పాటు.. న్యాయ వ్యవస్థ పై తనకు ఎంత గౌరవం ఉందో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదులు స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో కోర్టులు, న్యాయవ్యవస్థ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని.. ఈ విషయాలతో ఐఏ దాఖలు చేశామని అన్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి పూర్తి బాధ్యత ఉంటుందని న్యాయవాదులు పేర్కొన్నారు. న్యాయవాదుల, న్యాయమూర్తుల ఫోటోలు పెట్టి ఇష్టారీతిలో సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ వివరాలు అన్ని ఐఏలో పొడుపరిచినట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. పిటిషనర్ దాఖలు చేసిన ఐఏ పై సమాధానం చెప్పాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్ ల ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

ట్రెండింగ్ వార్తలు