ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. స్పీకర్‌కు కీలక ఆదేశాలు.. మూడు నెలలు డెడ్‌లైన్..

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

Supreme Court

Supreme Court : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్ అన్నట్లుగా ఉండకూడదని పేర్కొంది. అయితే, ఈ అంశంపై మూడు నెలల్లో తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, సాకులు చెప్పి వాయిదా వేద్దామంటే కుదరదు అంటూ న్యాయస్థానం పేర్కొంది. స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దని, ఆ 10మంది ఎమ్మెల్యేలు అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనని, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచడం సరికాదని, అలాచేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లే అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ పొడిగించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే.. స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చునని న్యాయస్థానం పేర్కొంది. ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. స్పీకర్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు.. పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు పార్లమెంట్ చట్టం తీసుకురావాలని అభిప్రాయ పడింది.

2023లో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ లు కొంతకాలం తరువాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ ను కోరారు. అయినా, స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో.. పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు సార్లు పిటీషన్లపై విచారణ జరిగింది. తాజాగా.. సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది.