Suryapet SP Rajendra Prasad : సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ రాజకీయ పార్టీ కార్యకర్తలా వ్యవహరించడం వివాదాస్పదంగా మారింది. వజ్రోత్సవాల వేదికపై మంత్రి జగదీశ్ రెడ్డికి జైకొట్టారు ఐపీఎస్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్. జయహో జగదీశ్ అన్న అంటూ నినాదాలు చేశారు జిల్లా ఎస్పీ. ఆయన జైకొట్టడమే కాకుండా అక్కడున్న అందరితో మంత్రి జగదీశ్ రెడ్డికి జైకొట్టించారు జిల్లా పోలీస్ బాస్.
అంతటితో ఆపలేదు. మంత్రి జగదీశ్ రెడ్డిని బాహుబలితో పోల్చారు. పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. జిల్లా ఎస్పీ వ్యవహరించిన తీరు అక్కడున్న వారందరిని విస్మయానికి గురి చేసింది. ఒక జిల్లాకు ఎస్పీ అయి ఉండి రాజకీయ పార్టీ కార్యకర్తలా మంత్రికి జైకొట్టడం ఏంటని అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల్లో మంత్రి జగదీశ్ రెడ్డి, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఎస్పీ రాజేంద్రప్రసాద్ తీరుపై రాజకీయ, ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎస్పీ అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి మంత్రికి జేజేలు పలకడం ఏంటని రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. పక్కా టీఆర్‌ఎస్ నేత మాట్లాడినట్లుగా ఎస్పీ ప్రసంగం ఉందంటూ జిల్లా పోలీస్ బాస్ తీరును తప్పుపడుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి.. మంత్రికి జేజేలు పలికిన సూర్యాపేట జిల్లా ఎస్పీపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డిని బాహుబలి అని పొగడటంపై ఆయన ఫైరయ్యారు. సూర్యాపేట ఎస్పీ తీరు సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన కలెక్టర్ ఎమ్మెల్సీ అయ్యారని.. మంత్రిని ప్రశంసించిన ఎస్పీ ఏమవుతారంటూ ఉత్తమ్ సెటైర్లు వేశారు.
కాగా.. గతంలో సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామి రెడ్డి సీఎం కేసీఆర్ కు పాదాబివందనం చేయడం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. సిద్దిపేటలో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని గతేడాది జూన్ 20న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆ సమయంలో నూతన కలెక్టరేట్ లోని తన చాంబర్ లోని ఆసీనులైన తర్వాత కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సీఎం పాదాలకు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకొన్నారు. ఆ తర్వాత తన కుటుంబసభ్యులను కేసీఆర్ కు ఆయన పరిచయం చేశారు. తర్వాత కొద్దిరోజులకే వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ ఎమ్మెల్సీని చేశారు.