స్వామి గౌడ్ అసంతృప్తి గుర్తింపు కోసమేనా.. మిగిలిన వారికి ప్రేరణ అవుతుందా..

రాజకీయాల్లో అలకలు, అసంతృప్తులు చాలా కామన్‌. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీకి ఈ తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వరుసగా రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్‌ పార్టీలో ఈ మధ్య అసంతృప్తి పెరుగుతున్నట్టుగా కనిపిస్తోందనే టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా పదవుల విషయంలో నేతల్లో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నా బయటపెట్టే పరిస్థితులు ఉండవు. కొన్ని సార్లు పరోక్ష వ్యాఖ్యలు చేయడం ద్వారా అగ్గి రాజేస్తుంటారు.

కేసీఆర్‌ లాంటి అధినేత ఉన్నప్పుడు నాయకులు కాస్త ఆచితూచి తమ అసంతృప్తిని వెళ్లగక్కడం సాధారణమే. గులాబీ పార్టీ నేత‌ల్లో ఉన్న అసంతృప్తి ఇప్పుడిప్పుడే మెల్లగా బ‌య‌ట‌ప‌డుతోంది. అధికార పార్టీ కావ‌డంతో నేత‌లు ఆచితూచి మాట్లాడుతున్నా.. శాసనమండ‌లి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చ‌ర్చనీయంశంగా మారాయి. అధికారం చెలాయించ‌డం, కొన్ని కులాల‌కే ప‌రిమితమైంద‌న్న వ్యాఖ్యల వెనుక మ‌ర్మం ఏమిట‌నే చ‌ర్చ పార్టీలో మొద‌లైంది.

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల‌ను ముందుండి న‌డిపించింది టీఎన్జీఓ నేత స్వామి గౌడ్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఒక విధంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. నారాయణ గురు జ‌యంతి వేడుకల సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామిగౌడ్‌ చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయ చ‌ర్చకు దారి తీస్తున్నాయి. తొలి విడ‌త ప్రభుత్వంలో శాస‌న‌మండ‌లి చైర్మన్ ప‌ద‌విని నిర్వహించిన ఆయ‌న… ఎమ్మెల్సీ ప‌ద‌వీకాలం ముగిసినప్పటి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగానే ఉంటున్నారు.

ఇప్పుడు సడన్‌గా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీలో అసంతృప్తి గళం వినిపించినట్లు అయిందని అంటున్నారు. వాస్తవానికి పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు ముగుస్తోంది. చాలా వరకూ నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయడంలో కేసీఆర్‌ స్పీడు చూపించడం లేదు. దీంతో ఆశావహుల్లో నిరాశతో పాటు అసహనం కూడా పెరుగుతోందని అంటున్నారు.

ఎప్పటికప్పుడు నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి కేసీఆర్‌ సిద్ధపడుతున్నారంటూ ప్రచారం జరగడమే తప్ప ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఇప్పటికీ చాలా పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎప్పుడు భర్తీ చేస్తారన్నది కూడా తెలియడం లేదు. ఇప్పుడు స్వామి గౌడ్‌ బయటపడినప్పటికీ లోలోపలే అసంతృప్తిని అణచివేసుకుంటున్న నాయకులు చాలా మందే అధికార పార్టీలో ఉన్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఉద్యమ స‌మ‌యం నుంచి ప‌ద‌వీకాలం పూర్తయ్యే వ‌ర‌కు స్వామిగౌడ్‌కు చాలా ప్రాధాన్యం ఉండేది.

ఉద్యమ స‌మ‌యంలో ఉద్యోగ సంఘంపై ఉన్న ప‌ట్టుతోపాటు సీఎం కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా గుర్తింపు పొందారు. స్వామిగౌడ్‌ పదవీకాలం ముగిసిన నాటి నుంచి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచేందుకు ప్రయ‌త్నించారు. రాజేంద్రన‌గ‌ర్ ఎమ్మెల్యేగా లేదా చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని ఆశించారు. పార్టీ ఆదేశిస్తే గ్రేట‌ర్‌లో ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలు ఇచ్చారు. కానీ ఎక్కడా అవ‌కాశం ద‌క్కలేదు. రాజ‌కీయంగా కూడా గ‌తంలో ఉన్న ప‌ట్టును కోల్పోయారు.

త‌మ సామాజికవ‌ర్గం నుంచి ప‌రిశీలించిన‌ట్లయితే గ‌తంలో మంత్రి ప‌ద‌వితో పాటు మండ‌లి చైర్మన్‌గా స్వామి గౌడ్‌కు అవ‌కాశం ద‌క్కింది. ఈ విడ‌త ప్రభుత్వంలో ఒక్కరికే మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. ఆ సామాజికవర్గంలో కూడా గుర్తింపుపోతుంద‌నే ఆవేద‌న‌తో స్వామి గౌడ్ ఉన్నార‌ని ప్రచారం జ‌రుగుతోంది. రెండో సారి అధికారంలోకి వ‌చ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా…. ఇప్పటి వరకూ ఎలాంటి పదవులు దక్కని చాలా మంది నేతల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఇంకా బయటపడడం లేదంటున్నారు.

మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా ఒకటి రెండు సందర్భాల్లో కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ రెండో సారి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కలేదు. తుమ్మల నాగేశ్వరరావు కూడా కొంత అసంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు. ఇక నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో విపరీతంగా జాప్యం జరుగుతుండడంతో పార్టీ నేతల్లో కాస్త అసహనం కనిపిస్తోందని చర్చించుకుంటున్నారు.

స్వామి గౌడ్‌ వ్యాఖ్యలు రాజ‌కీయంగా గుర్తింపు కోసం కూడా కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్వామి గౌడ్‌ బయటపడ్డారు… భవిష్యత్తులో మరికొందరు నేతలు కూడా తమ అసంతృప్తిని బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు.