Tammineni Veerabhadram
Tammineni Veerabhadram – Warangal: ప్రధాని నరేంద్ర మోదీ (Naredndra Modi) వరంగల్‌లో పర్యటించి, వ్యాగన్ వర్క్‌షాప్()కు శంకుస్థాపన చేయడం పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.
హైదరాబాద్ లో తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర విభజన చట్టం హామీల మేరకు తెలంగాణలోని కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉందని, తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు వరంగల్ లో వ్యాగన్ వర్క్‌షాప్‌కు శంకుస్థాపన చేయడం తెలంగాణ ప్రజలను మోసగించడమేనని తెలిపారు.
మోదీ పర్యటనలో విభజన హామీల ప్రస్తావన ఎందుకు లేదని ఆయన నిలదీశారు. ఆయన పర్యటన తెలంగాణ ఎన్నికలలో ఓట్ల కోసమే తప్ప తెలంగాణకు ఉపయోగం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీతో పాటు గిరిజన వర్సిటీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు గురించి కూడా మోదీ మాట్లాడలేదని అన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి తగాదాను పెంచారని తమ్మినేని విమర్శించారు. అలాగే, ఒక్క ప్రాజెక్టును కూడా జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదని అన్నారు. దేశంలో ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మోదీ… ఇప్పుడు తెలంగాణకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడంలేదని మాట్లాడుతున్నారని చెప్పారు.