Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో .. పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రులు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంతో మంత్రులు పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. దివంగత పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతి రావు మృతికి సంతాపం ప్రకటించింది శాసనసభ. అనంతరం మంత్రులు పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ జీఎస్టీ సవరణబిల్లును ప్రవేశపెట్టగా..మంత్రి కేటీఆర్ పురపాలక నిబంధనల బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే మంత్రి పువ్వాడ మోటారు వాహనాలు సన్ను సవరణ బిల్లును ప్రవేశపెట్టగా..విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్శిటీల ఉమ్మడి నియామక బోర్డు, అటవీ వర్శిటీ బిల్లును ప్రవేశపెట్టారు. ఇలాపలువురు మంత్రులు ఏడు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో విపక్షాలు వాయిదా తీర్మానాలను ప్రవేశ పెట్టగా వాటిని స్పీకర్ తిరస్కరించారు. కేంద్ర విద్యుత్ చట్టంపై స్వల్పకాలిక చర్చ చేపట్టింది సభ.

కాగా..సెప్టెంబర్ 6న సమావేశమై వాయిదా పడిన తెలంగాణ శాసనసభ, శాసన మండలి వానాకాలం సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈరోజు ఏడు బిల్లులు, పలు పత్రాలు సభ ముందుకు వచ్చాయి. సభ నిర్వాహణలో భాగంగా తెలంగాణ సదరన్‌ డిస్కమ్, ట్రాన్స్‌కో, టీఎస్‌ రెడ్కో వార్షిక నివేదికలు, తెలంగాణ సమగ్ర శిక్షా 2020- 21 ఆడిట్‌ రిపోర్ట్, స్టేట్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ రెగ్యులేషన్స్‌ పత్రాలను సంబంధిత శాఖల మంత్రులు సభకు సమర్పించనున్నారు.

ఇక వివిధ శాఖలకు చెందిన ఏడు చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. వీటిలో మున్సిపల్‌శాఖ చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ, అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణ, అటవీ యూనివర్సిటీకి సంబంధించిన, తెలంగాణ యూనివర్సిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, తెలంగాణ మోటర్‌ వెహికిల్స్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లులు ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు.

కాగా..బీఏసీ సమావేశానికి బీజేపీ సభ్యులను ఆహ్వానించక పోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్‌పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రస్తావించే అవకాశం ఉంది. సభ్యుల ప్రవర్తనా నియమావళికి ఈటల వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించిన క్రమంలో ఈటలపై చర్యలు తీసుకోవాలంటూ టీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుపట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు.

 

ట్రెండింగ్ వార్తలు