Corona Telangana
Telangana Covid 19 Cases : తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. భారీగా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 80వేల 181 శాంపుల్స్ టెస్ట్ చేయగా 7వేల 994 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 58మంది కరోనాకు బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం(ఏప్రిల్ 29,2021) ఉదయం బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 4009 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 76వేల 60 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలోనే 1630 కేసులు ఉన్నాయి.
ఇంతవరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 27 వేల 960కి పెరిగింది. రికవరీ రేటు మరింత తగ్గి 81.71 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో ఇంతవరకు కోలుకున్నవారి సంఖ్య 3 లక్షల 49 వేల 692. కొత్తగా నమోదైన మరణాలతో కోవిడ్, తదితర సమస్యలతో మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 2 వేల 208 కి పెరిగింది. మేడ్చల్ మల్కాజ్ గిరి లో 615, రంగారెడ్డి జిల్లాలో 558, నల్గొండ జిల్లాలో 424, సంగారెడ్డి జిల్లాలో 337, నిజామాబాద్ లో 301 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో 200లకు పైగా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
కోవిడ్ టీకాలు:
తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న(ఏప్రిల్ 28,2021) లక్షా 38 వేల 152 మందికి టీకాలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 12 వందలకు పైగా వాక్సినేషన్ కేంద్రాలు పని చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ టీకాలు తీసుకున్నవారి సంఖ్య 45 లక్షల 36 వేలు.