Ts Eamcet
Telangana EAMCET results : తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. 1,47,991 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పరీక్ష రాశారని.. అందులో 1,21,480 మంది అర్హత సాధించారని తెలిపారు. అంటే 82.08 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని పేర్కొన్నారు. 79,009 మంది విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష రాయగా 73,070 మంది అర్హత పొందారని చెప్పారు. అంటే 92.48 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారని పేర్కొన్నారు.
మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది 28 వేల మంది విద్యార్థులు అధికంగా ఎంసెట్ పరీక్ష రాశారని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా సమన్వయంతో, ఎలాంటి ఇబ్బంది రాకుండా పరీక్షను నిర్వహించామని పేర్కొన్నారు. ఎంసెట్‌ను 9 విడతల్లో నిర్వహించామని వెల్లడించారు.
ఇంజినీరింగ్ పరీక్షలో మొదటి ర్యాంక్ పశ్చిమ గోదావరికి చెందిన కార్తికేయ, రెండో ర్యాంకును వెంకట నరేష్ (రాజంపేట-కడప), మూడో ర్యాంక్ మహ్మద్ అబ్దుల్ (హైదరాబాద్), నాలుగో ర్యాంక్ రామస్వామి (నల్లగొండ), ఐదో ర్యాంక్ వెంకట ఆదిత్య (కూకట్‌పల్లి) సాధించారు.
అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలో మొదటి ర్యాంక్ మండవ కార్తికేయ (హైదరాబాద్), రెండో ర్యాంకు ఎమాని శ్రీనీజ (రంగారెడ్డి), హైదరాబాద్‌కు చెందిన కౌశల్ రెడ్డి మూడో ర్యాంకు సాధించారు.
ఈ ఏడాది ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం 45 శాతం మార్కుల నిబంధనను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఇక ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ మొదటి విడత ఈ నెల 30న ప్రారంభమవుతుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.