Rythu Bharosa : రైతు భరోసాపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెల 15 నుంచి వారి అకౌంట్లోకి డబ్బులు..

Rythu Bharosa : రైతు భరోసాపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 15 నుంచి వారి ఖాతాల్లో నగదు జమ చేయనుంది.

telangana government announced to release rythu bharosa funds for new landowners from 2026 april 15

Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త.. రైతు భరోసా పథకంపై కీలక అప్డేట్ వచ్చేసింది. కొన్ని రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం.. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అర్హులైన ప్రతి రైతు ఖాతాలో ఒక ఎకరాకు సంబంధించి రూ.6 వేలు జమ చేసింది. త్వరలోనే రెండో విడత.. చివరకు ఏప్రిల్ చివరి నాటికి మూడో విడతలో మొత్తం అన్ని ఎకరాలకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో రైతు భరోసా నిధులపై కీలక అప్డేట్ వచ్చేసింది.

రాష్ట్రంలో కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి.. నూతనంగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులకు కూడా త్వరలోనే రైతు భరోసా నిధులు జమ చేయనుంది. ఏప్రిల్ 15 నుంచి వీరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో కొత్తగా పాస్ బుక్ పొందిన రైతులు 85 వేల మంది ఉన్నారు. వీరిలో 62 వేల మంది రైతు భరోసా కోసం అప్లై చేసుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారులు వీరి దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. వీరిలో అర్హులైన వారిని గుర్తించిన తర్వాత.. వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చనుంది. 10 రోజుల్లో నూతన లబ్ధిదారుల జాబితా విడుదల చేయనున్నారు. వీరికి ఏప్రిల్ 15-20వ తేదీల మధ్యలో రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు.

యాసంగి సీజన్‌కు సంబంధించి మొత్తం రూ.9 వేల కోట్లను రైతు భరోసా కింద అన్నదాతలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతసారి వానాకాలం సీజన్‌లో లబ్ధి పొందని వారికి కూడా ఈసారి నిధులు జమ చేస్తోంది. తాజాగా కొత్తగా పాస్ బుక్‌లు పొందిన వారికి కూడా రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 69.39 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రూ.8,744 కోట్లను విడుదల చేసింది. అప్పట్లో 9 రోజుల్లోనే రైతులందరి ఖాతాల్లో వేసింది. కానీ ఈసారి రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి కొత్త గైడ్‌లైన్స్ పాటిస్తోంది. ఎన్ని ఎకరాలు ఉన్నా ముందుగా తొలి విడతలో ప్రతి ఒక్కరికీ తొలి ఎకరానికి గాను రూ.6 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో రైతులందరికీ ఒకేసారి లబ్ధి చేకూరినట్లయ్యింది. ఏప్రిల్ చివరి నాటికి ప్రతి ఒక్కరి ఖాతాలో మొత్తం నిధులు జమ అవుతాయంటున్నారు అధికారులు.