Basara Temple Theft: బాసర ఆలయంలో చోరీ కేసు.. సీసీ కెమెరాల్లో చిక్కిన నిందితులు.. కీలక ఆధారాలు లభ్యం..
Basara Temple Theft case : బాసర ఆలయం చోరీ కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆలయంలోని సీసీ కెమెరాల్లో చోరీకి పాల్పడిన నిందితుల దృశ్యాలు రికార్డు అయ్యాయి. సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Basara Mahankali Temple Silver Cash Theft
Basara Temple Theft case : నిర్మల్ జిల్లాలోని బాసర అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. సరస్వతీ అమ్మవారి ఆలయం పైఅంతస్తులోని మహంకాళి ఆలయంలో అమ్మవారి వెండి కిరీటం, హుండీని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. హుండీని వ్యాసగుడి దగ్గర పడేసి పరారయ్యారు. అయితే, అర్చకులు మంగళవారం తెల్లవారుజామున పూజకోసం వెళ్లి చూడగా చోటీ జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రంగంలోకిదిగి చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే, గత రెండేళ్లలో రెండోసారి ఆలయంలో చోరీ జరగడం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.
పోలీసుల దర్యాప్తులో చోరీ ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు మాస్క్ లు వేసుకొని ఆలయంలోకి ప్రవేశించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీ పుటేజీల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్, స్క్వా్డ్ రంగంలోకి దిగాయి.
ఆలయంలో భద్రతా చర్యలు తగిన స్థాయిలో లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాన ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు, డోర్ ఫ్రేమ్ స్కానర్లు లేకపోవడంతో భక్తులను ఎలాంటి తనిఖీలు లేకుండానే లోపలికి అనుమతిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఒకసారి చోరీ జరిగినప్పటికీ భద్రతను బలోపేతం చేయడంలో ఆలయ యంత్రాంగం నిర్లక్ష్యం వహించిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఆస్తులు, భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సేకరించిన ప్రాథమిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల పరిశీలన తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ .. ఘటనకు సంబంధించిన ప్రతి కోణంలో దర్యాప్తు చేపట్టి, నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
ఆలయ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తును వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు.
కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
