Telangana Government: తెలంగాణ రైతులకు శుభవార్త.. క్వింటాల్‌కు రూ.500 బోనస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
తెలంగాణ(Telangana Government)లోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది.
- V Santhosh Kumar
- Published on- September 6, 2026 / 03:27 PM IST
Telangana government announces Rs. 500 bonus for fine-variety paddy.
అక్టోబర్ 15న ధాన్యం కొనుగోళ్లు
8283 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
క్వింటాల్‌కు రూ.500 అదనపు బోనస్
Telangana Government: తెలంగాణలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాబోయే వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను అక్టోబర్ 15 నుంచి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ సీజన్‌లో దాదాపు రూ. 18,250 కోట్ల విలువైన 65 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాలను ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలు సిద్ధం:
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా(Telangana Government) 8,283 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వీటిలో 3,180 ఐకేపీ కేంద్రాలు, 4,372 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), 731 ఇతర కేంద్రాలు ఉన్నాయి. అక్టోబర్ 1 నాటికే ఈ కేంద్రాలన్నింటినీ పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గన్నీ సంచులు, తూకం యంత్రాలు, రవాణా వాహనాలను అందుబాటులో ఉంచి కొనుగోలు చేసిన వెంటనే నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 అదనపు బోనస్:
ధాన్యానికి మద్దతు ధరగా గ్రేడ్-ఏ రకానికి క్వింటాల్‌కు రూ. 2,461, సాధారణ రకానికి రూ. 2,441 చెల్లించనున్నారు. దీనికి అదనంగా ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 చొప్పున బోనస్ అందించనున్నారు. BPT-5204, RNR-15048, జైశ్రీరామ్ వంటి సన్న రకాలకు ఈ బోనస్ వర్తిస్తుంది. విత్తనాలు కొనుగోలు చేసినప్పుడే డీలర్ల వద్ద విత్తన రకాన్ని నమోదు చేసుకున్న రైతులకు ఈ బోనస్ సొమ్ము సులభంగా అందుతుందని మంత్రి వివరించారు.
