Telangana Govt
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఈ మేరకు పథకాలను అమలు చేస్తోంది. తాజాగా మహిళలకు భారీ శుభవార్తను చెబుతూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. అంతేకాక.. టీ-డయాగ్నస్టిక్స్ నెట్‌వర్క్ ద్వారా దాదాపు 30 రకాల కీలకమైన వైద్య పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా నిర్వహించనుంది. ఈ మొత్తం స్క్రీనింగ్ ప్రక్రియ నాలుగు దశల్లో.. ఆరు నెలలు కొనసాగనున్నాయి.
Also Read : Shiv Pratap Shukla : తెలంగాణ కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా.. ఎవరీయన?.. ఫుల్ బయోడేటా ఇదే..
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా పలు కార్యక్రమాలను రేవంత్ సర్కార్ చేపడుతోంది. ఇందులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తోంది. వడ్డీ రహిత రుణాలు, క్యాంటీన్లు, అద్దె బస్సులకు యాజమానులను చేస్తోంది. ఇవిగాకుండా రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురానుంది.
డ్వాక్రా గ్రూపులోని సభ్యులకు మాత్రమే ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ ఉండేది. బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న సభ్యురాలు చనిపోతే సంబంధిత కుటుంబ సభ్యులే బకాయి చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు బాధిత కుటుంబంపై ఆ భారాన్ని తగ్గించేందుకు.. మహిళల రుణానికి బీమా స్కీమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రుణం తీసుకున్నవారు మరణిస్తే ప్రభుత్వమే బ్యాంకునకు ఆ రుణాన్ని చెల్లిస్తుంది. ఆ సభ్యురాలికి రూ.10లక్షలు బీమా కూడా ఉంటుంది. ఈ బీమా ప్రీమియంను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.
మరోవైపు.. 100 రోజుల ఆరోగ్య మిషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ వైద్య విప్లవానికి ప్రభుత్వం నాంది పలకనుంది. ప్రధానంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా (మార్చి8)న ప్రత్యేకంగా మహిళలకు హెల్త్ స్క్రీనింగ్ టెస్టులను ప్రారంభించనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద మహిళల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఎటువంటి ఖర్చు లేకుండా అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలను వారి ముగింటకే చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల్లో ప్రాణాంతకరమైన క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను కూడా ఇందులో అతర్భాగం చేశారు.
ఈ మిషన్ కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా ప్రతి మహిళకు ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయనుంది ప్రభుత్వం. దీనిద్వారా భవిష్యత్తులో వారికి ఏదైనా అనారోగ్యం సంభవిస్తే వారి పూర్తి వైద్య చరిత్ర ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటుంది. తద్వారా మెరుగైన చికిత్స అందించడం సులభతరం అవుతుంది.