Rythu Bharosa Scheme: రైతుల ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ నిధులు.. రెండు రోజుల్లోనే రూ.4,072 కోట్ల పంపిణీ.. మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా?
తెలంగాణలో వానాకాలం సీజన్‌కు సంబంధించి ఖరీఫ్ రైతుభరోసా నిధుల(Rythu Bharosa Scheme) పంపిణీ శరవేగంగా సాగుతోంది.
- V Santhosh Kumar
- Updated on- July 2, 2026 / 07:43 AM IST
Telangana government distributed 4,000 crore under the Rythu Bharosa scheme in just two days
- రైతుభరోసా నిధుల శరవేగ పంపిణీ
- రెండు రోజుల్లో భారీగా జమ
- తొమ్మిది రోజుల్లో ప్రక్రియ పూర్తి
Rythu Bharosa Scheme: తెలంగాణలో వానాకాలం సీజన్‌కు సంబంధించి ఖరీఫ్ రైతుభరోసా నిధుల(Rythu Bharosa Scheme) పంపిణీ శరవేగంగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 30న శిల్పకళావేదికలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజే రెండెకరాల లోపు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,482 కోట్లను ప్రభుత్వం బదిలీ చేసింది. బుధవారం ఉదయానికే ఈ నిధులు రైతుల బ్యాంక్ ఖాతాలకు చేరడంతో వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. బుధవారం రెండో విడత కింద మరో 10.68 లక్షల మంది రైతులకు నిధులు విడుదల చేయగా, రెండు రోజుల్లోనే మొత్తం రూ.4,072 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
WhatsApp: ఇంకా లాంచ్ చేయలేదట.. కేంద్రం నోటీసులపై క్లారిటీ ఇచ్చిన వాట్సాప్
9 రోజుల పక్కా షెడ్యూల్: కోటిన్నర ఎకరాలకు సాయం:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 73.32 లక్షల మంది పట్టాదారులకు చెందిన కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూమికి పెట్టుబడి సాయం అందించడమే ఈ పథకం లక్ష్యం. ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ.9 వేల కోట్ల నిధులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం విడతల వారీగా పక్కా షెడ్యూల్‌ను రూపొందించింది. గతేడాది లాగే ఈసారి కూడా కేవలం 9 రోజుల్లోనే చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రోజుకో ఎకరం చొప్పున లబ్ధిదారుల పరిమితిని పెంచుతూ, చివరి రోజున 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులందరికీ ఒకేసారి నగదు బదిలీ చేయనున్నారు.
సాగు సమయంలోనే ఆర్థిక అండ:
ప్రస్తుతం ఖరీఫ్ సాగు పనులు ప్రారంభమై, రైతులు పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలోనే ఈ నిధులు విడుదల కావడం గమనార్హం. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు సరిగ్గా సమయానికే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే డబ్బులు జమ అవుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో సాగు సందడి నెలకొంది.
