Peddi Sudarshan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత
Peddi Sudarshan Reddy : బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
Peddi Sudarshan Reddy
Peddi Sudarshan Reddy : బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటీన స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన ఆసుపత్రి వైద్యులు సుదర్శన్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు హుటాహుటీన వరంగల్ కు బయలుదేరి వెళ్లారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామంలో జన్మించారు. పెద్ది రాజిరెడ్డి, అమృతమ్మ తల్లిదండ్రులు. పెద్ది సుదర్శన్ రెడ్డికి భార్య స్వప్న, కుమారుడు నిదర్షన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠ రెడ్డి ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. 1991లో వరంగల్‌లో ఇంటర్ పూర్తి చేశారు. నల్లబెల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సుదర్శన్ రెడ్డి.. దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా సేవలందించారు.
2001లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తరువాత నల్లబెల్లి జడ్పీటీసీగా గెలుపొంది.. టీఆర్ఎస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ గా కొనసాగారు. 2004 డిసెంబర్లో వరంగల్ టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్‌గా నియామకం అయ్యారు. 2005లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఎనిమిదేళ్లు సుదర్శన్ రెడ్డి సేవలందించారు. 2006 నుంచి 2014 వరకు టీఆర్ఎస్ పొలిటికల్ బ్యూరో మెంబర్ గా కొనసాగారు.
2014లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సుదర్శన్ రెడ్డి.. దొంతి మాధవరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో నర్సంపేట ఎమ్మెల్యేగా దొంతి మాధవరెడ్డిపై గెలుపొందారు. 2018లో శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యునిగా సుదర్శన్ రెడ్డి సేవలందించారు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గానూ సేవలందించారు. 2023 ఎన్నికల్లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
