Telangana Rice Millers: తెలంగాణ రైస్ మిల్లర్లపై ఉక్కుపాదం.. ఆస్తుల జప్తుకు ఆదేశాలు.. సర్కార్ సీరియస్ వార్నింగ్

తెలంగాణాలో రైస్ మిల్లర్లపై(Telangana Rice Millers) కీలక చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.

Telangana government has issued stern warnings to rice millers.

Telangana Rice Millers: తెలంగాణ రాష్ట్రంలో రైతుల వద్ద నుంచి కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిన ప్రభుత్వ ధాన్యానికి సంబంధించి, పౌర సరఫరాల శాఖకు అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్(Telangana Rice Millers) బకాయిల పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రజల సొమ్ముతో సేకరించిన ధాన్యాన్ని దారి మళ్లిస్తూ కాలయాపన చేస్తున్న డిఫాల్ట్ మిల్లర్ల ఆటకట్టించేందుకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వానికి రావలసిన బియ్యాన్ని తక్షణమే అప్పగించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం కింద ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

Telangana Govt: భూ యజమానులకు శుభవార్త.. 22A ఆస్తుల క్రమబద్ధీకరణ.. ప్రభుత్వం నుంచి ఐదు కీలక జీవోలు జారీ

అక్టోబర్ 5 నుంచి అధికారులకు ప్రత్యేక శిక్షణ, జప్తు ప్రక్రియ:

చట్టపరమైన చిక్కులు తలెత్తకుండా మిల్లర్ల ఆస్తులను వేగంగా జప్తు చేయడం కోసం పౌర సరఫరాల శాఖ అధికారులకు హైదరాబాద్‌లోని MCRHRD సంస్థలో అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తనిఖీల ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా ప్రభుత్వం నూతన నిబంధనలను సైతం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో అకస్మాత్తుగా నిర్వహించే తనిఖీల్లో గోదాముల్లో ధాన్యం నిల్వలు తక్కువగా ఉన్నట్లు తేలితే సదరు మిల్లర్లకు తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు.

ఏడు రోజుల గడువు, కఠిన నిబంధనల అమలు:

నోటీసులు అందుకున్న మిల్లర్లు కేవలం ఏడు రోజుల వ్యవధిలోనే పూర్తి వివరణ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా సరైన సమాధానం రాకపోతే ఎలాంటి మినహాయింపులు లేకుండా నేరుగా ఆస్తుల జప్తు, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులు మార్గం సుగమం చేశారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగానికి పాల్పడే వారిపై ఈ ప్రత్యేక డ్రైవ్ ద్వారా పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపాలని పౌర సరఫరాల శాఖ నిశ్చయించుకుంది.