22A Lands Registration : గుడ్‌న్యూస్.. ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు.. 22ఏ నిషేధిత జాబితాలోని భూములకూ రిజిస్ట్రేషన్లు..
22A Lands Registration : చెల్లుబాటు అయ్యే చట్టబద్ధమైన అనుమతులు ఉన్నట్లయితే, 22-ఎ కింద జాబితా చేయబడిన ఖాళీ స్థలాలు, ఇళ్లు మరియు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
- Harish Thanniru
- Published on- September 25, 2026 / 08:30 AM IST
22A Lands Registration
22A Lands Registration : రాష్ట్ర వ్యాప్తంగా చాలాకాలం నుంచి 22ఏ జాబితాలో కొనసాగుతున్న ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లకు శాశ్వత విముక్తి కల్పిస్తూ తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. గురువారం రాత్రి ఈ మేరకు రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read : Danam Nagender : దానం నాగేందర్‌ను టెన్షన్ పెడుతున్న గత ఉపఎన్నిక..! ఈసారి మంత్రిగా బరిలోకి?
ప్రభుత్వం నిర్ణయం ద్వారా లక్షలాది మందికి ఊరట లభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి పరిధిలో ఉన్న అనేక నివాస కాలనీల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. 22ఏలో ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ ఈ మూడింటి అప్రూవల్ ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ప్రభుత్వ లే అవుట్ ఉండి కూడా, సర్వే నంబర్ల తప్పులు, లేదా ఇతర కారణాల వల్ల రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లకు నోచని వారికి ఇది ఊరటగా మారనుంది. మరోవైపు చాలాకాలంగా స్తంభించిపోయిన రియల్ ఎస్టేట్ లావాదేవీలకు మళ్లీ చలనం రానుంది.
22ఏ భూములు చేరడం ద్వారా పలుచోట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వం ఈ సమస్యను ప్రత్యేకంగా భావించి శాసనసభ సమావేశాల్లో చర్చ పెట్టింది. ఈనెల 16న శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 22ఏ జాబితాలో కొనసాగుతున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లకు శాశ్వత విముక్తి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల్లో పలు అంశాలను పేర్కొంది.
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), అర్బన్, గ్రామీణ స్థానిక సంస్థల (మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలు) నుంచి అనుమతులు పొంది అభివృద్ధి చేసిన ఖాళీ స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్లకు నిర్దేశిత నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తారు.
రిజిస్ట్రేషన్‌కు వెళ్లే దరఖాస్తుదారులు కొన్ని సూచనలు పాటించాలి. ప్రభుత్వ సంస్థల నుంచి చట్టబద్ధమైన అనుమతులున్నట్లు తెలిపే పత్రాలు తప్పనిసరి. ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన చెల్లుబాటు అయ్యే లేఅవుట్, భవన, అపార్ట్‌మెంట్ నిర్మాణ అనుమతులు ఉండాలి. అంతేకాక.. అనుమతుల అనంతరం జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏదో ఒక లింక్ డాక్యుమెంట్ తప్పనిసరి. ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కరించడానికి జిల్లా స్థాయిలో కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ నేతృత్వం వహిస్తారు. మరోవైపు కోర్టు కేసుల్లో ఉన్న సమస్యలు, అంశాలైతే.. అవి కోర్టుల తుది తీర్పునకు లోబడి ఉంటాయి.
