Telangana Government : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాసులు.. ఎప్పటినుంచంటే?
Telangana Government : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో సీనియర్ సిటిజన్స్ కు కూడా ఉచిత బస్ పాసులు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
- Harish Thanniru
- Published on- October 2, 2026 / 09:57 AM IST
Telangana Government
Free Bus Passes For Senior C itizens : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమైంది. మహిళలతోపాటు సీనియర్ సిటిజన్స్ కు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఆధార్ కార్డు కలిగిన ప్రతి మహిళ పలురకాల బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే, రానున్న రోజుల్లో సీనియర్ సిటిజన్స్ కు కూడా ఉచిత బస్ పాసులు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో గురువారం ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాసులు అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
అయితే అర్హతలు, స్కీమ్ నిబంధనలు ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్నారు. ఉచిత బస్ పాస్‌లు అందుబాటులోకి వస్తే పురుషులకూ లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాస్ ల సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తే 60ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది.
మరోవైపు.. హైదరాబాద్ నగరంలో ప్రయాణించే ప్రయాణికుల కోసం తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్‌ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో రైల్ సంయుక్తంగా కామన్ ట్రావెల్ పాస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. శుక్రవారం ప్రజాభవన్‌లో జరిగే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కామన్ పాస్ ద్వారా ఒకే పాస్‌తో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రోజువారీ, వారపు, నెలవారీ పాస్‌లను ప్రవేశపెట్టనున్నారు.
