Telangana Government : తెలంగాణ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. ఒక్కొక్కరికి తులం గోల్డ్ పంపిణీ? ముహూర్తం ఫిక్స్..
Telangana Government : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దసరా సందర్భంగా కల్యాణలక్ష్మీ పథకం స్థానంలో తులం గోల్డ్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
- Harish Thanniru
- Published on- October 3, 2026 / 08:50 AM IST
Telangana government Tulam Gold scheme
Telangana Government : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేలా పలు పథకాలను అమలు చేస్తోంది. ప్రస్తుతం మరో పథకానికి శ్రీకారం చుట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కల్యాణలక్ష్మి పథకం కింద ప్రస్తుతం ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. అయితే, కల్యాణలక్ష్మీ పథకాన్ని పేరుమార్చి ఆర్థిక రూపంలో కాకుండా పుస్తెలు, మట్టెల రూపంలో బంగారాన్ని పేదింటి ఆడబిడ్డలకు అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దసరా పండుగను పురస్కరించుకొని ప్రజలకు మరింత మేలుచేసేలా ప్రజాపాలన ముద్రను ప్రతిబింబించేలా సరికొత్తగా ఏవైనా కానుకలు ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా కల్యాణ లక్ష్మీ పథకం స్థానంలో తులం గోల్డ్ పథకంను రేవంత్ సర్కార్ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కల్యాణలక్ష్మీ పథకం కింద ప్రస్తుతం ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రభుత్వం.. ఇకనుంచి పుస్తులు, మట్టెల రూపంలో బంగారాన్ని పేదింటి ఆడబిడ్డలకు అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. దసరా నుంచి తులం గోల్డ్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.
గతంలో కొనసాగుతున్న ప్రజాకర్షణ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వ బ్రాండ్‌కు అనుగుణంగా మార్చుకోవడంతోపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకొని నేరుగా ప్రజలకు మరింత మేలు జరిగేలా కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లకు దసరా కానుకగా రెండు డీఏలను ప్రకటించిన ప్రభుత్వం.. మహిళలకు బతుకమ్మ చీరెలను, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, 2.5లక్షల మందికి చేయూత పెన్షన్లను అందించనుంది. ఇక కేసీఆర్ కిట్ తరహాలో మరో పథకం కూడా సీఎం రేవంత్ రెడ్డి మదిలో ఉందని సమాచారం. తద్వారా డెలివరీలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేలా చూడవచ్చుననే ఆలోచన పున:పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మొత్తానికి దసరా పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పలు పథకాలను ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తద్వారా ప్రజల ఆదరాభిమానుల మరింతగా పొందేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
మరోవైపు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలను రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్యాణ లక్ష్మీ కేసీఆర్ మానస పుత్రిక అని.. ఈ పథకం అమలుకు పన్నెండేళ్లు పూర్తయిందని.. పేదల మనన్నలు పొందిన ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2014 అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన ఈ పథకానికి శుక్రవారంతో 12ఏళ్లు నిండిన సందర్భంగా ఈ పథకం కింద లబ్ధిదారులందరికీ ఎక్స్ వేదికగా కేటీఆర్, హరీష్ రావులు వేరువేరుగా శుభాకాంక్షలు తెలిపారు.
