Telangana Govt : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ శుభవార్త.. ఆర్టీసీలో 4,538 ఉద్యోగాల భర్తీకి చర్యలు.. నోటిఫికేషన్ ఎప్పడుంటే?
Telangana Govt : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
Telangana government
Telangana Govt : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీజీఎస్ ఆర్టీసీలో సిబ్బంది కొరత, ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీలో 4,538 పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు.
టీజీఎస్ఆర్టీసీ యూనియన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఆర్థిక, సర్వీస్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. ఆర్టీసీలో సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతంఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని.. దీనిని గుర్తించిన ప్రభుత్వం కొత్తగా 4,538 పోస్టుల నియామక ప్రక్రియను త్వరలో పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017 పీఆర్సీకి సంబంధించిన పెండింగ్ బకాయిలతో పాటు డీఏ బకాయిలను ప్రభుత్వం పరిష్కరించిందని మంత్రి తెలిపారు. 2013 నుంచి పెండింగ్లో ఉన్న బాండ్లను కూడా క్లియర్ చేసినట్లు చెప్పారు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్ బకాయిలపైకూడా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గతంలో రూ.1,205 కోట్లుగా ఉన్న పీఎఫ్ బకాయిలను ప్రస్తుతం రూ.600 కోట్లకు తగ్గించినట్లు తెలిపారు. అదేవిధంగా సీసీఎస్ బకాయిలుకూడా రూ.690 కోట్ల నుంచి రూ.300కోట్లకు తగ్గినట్లు తెలిపారు. పీఎఫ్, సీసీఎస్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.75 కోట్లు చెల్లిస్తోందని వివరించారు.
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందని, మొత్తం 1,134 కారుణ్య నియామకాలను చేపట్టే ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. వివిధ కారణాలతో గతంలో శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించబడిన సుమారు 250 మంది ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
