Railways Department
Sankranti School Holidays 2026 : తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు సంక్రాంతి పండుగ సెలవులు వచ్చేశాయి. సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వరుసగా ఏడు రోజులపాటు సెలవులు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు విడుదల చేశారు.
Also Read : Rythu Bharosa : రైతులకు అలర్ట్.. రైతు భరోసా నిధులు వచ్చేది ఎప్పుడంటే..? తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
పండుగ అనంతరం జనవరి 17వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కళాశాలలు మాత్రం ఈ నెల 19న ప్రారంభం కానున్నాయి. అయితే, జనవరి 19న తరగతులు ప్రారంభమైన వెంటనే ప్రాక్టికల్ పరీక్షల సన్నద్ధతపై దృష్టి సారించాలని ఇంటర్ బోర్డు సూచించింది.
మరోవైపు.. పండుగ సెలవుల నేపథ్యంలో జంట నగరాల రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసిన దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది. టికెటింగ్ నుంచి భద్రత, పార్కింగ్, రైళ్ల స్టాపేజ్ ల వరకు పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లలో 17 బుకింగ్ కౌంటర్లు, 20 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ‘రైల్ వన్’ మొబైల్ యాప్ ద్వారా అన్ రిజర్వుడ్ టికెట్లు బుక్ చేసుకుంటే 3శాతం రాయితీ అందుతుందని, ఈ రాయితీ ఈనెల 14 నుంచి జూలై 14 వరకు అమల్లో ఉంటుందన్నారు.
డివిజన్ హెడ్ క్వార్టర్స్‌లో 24గంటలపాటు పనిచేసే వార్ రూమ్, అత్యాధునిక సీసీ టీవీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే జనవరి 7 నుంచి 20వ తేదీ వరకు హైటెక్ సిటీ స్టేషన్‌లలో 16 రైళ్లకు, చర్లపల్లి స్టేషన్ లో 11 రైళ్లకు ప్రత్యేక స్టాపేజ్‌లను కల్పించారు. రద్దీ సమయాల్లో ప్రయాణికులు ముందుగానే స్టేషన్లకు చేరుకొని, సమీప స్టేషన్ల సౌకర్యాలను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.