Rythu Bharosa : రైతులకు అలర్ట్.. రైతు భరోసా నిధులు వచ్చేది ఎప్పుడంటే..? తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Rythu Bharosa, : ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో 1.06కోటి ఎకరాలకు, 69.40 లక్షల మంది రైతులకు రూ.8,744 కోట్లు పంపిణీ చేసింది. ఈసారి సాగుదారులకే రైతు భరోసా నిధులు అనే నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Rythu Bharosa
- రైతు భరోసా నిధులు విడుదల మరింత ఆలస్యం
- పండుగ వేళ అన్నదాతల ఆశలపై నీళ్లు
- శాటిలైట్ సర్వే కారణంగా నిధుల విడుదల ఆలస్యం
- జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో నిధులు
Rythu Bharosa : యాసంగి సీజన్ ప్రారంభమైంది.. రైతులు పంటల సాగులో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో పెట్టుబడి సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా నిధులు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఆమేరకు అడుగులు ముందుకు పడడం లేదు. దీంతో రైతు భరోసా నిధులు ఈసారి మరింత ఆలస్యం అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు ఉన్నాయి.
Also Read : Telangana Govt : భారీ శుభవార్త.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ 1.02 కోట్ల ప్రమాద బీమా
రైతు భరోసా నిధులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం.. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపజేయాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం వ్యవసాయ యూనివర్శిటీతో కలిసి శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములను గుర్తించే పనిలో నిమగ్నమైంది. దీని ద్వారా అనర్హులను తొలగించి, ప్రజాధనాన్ని వృథా కాకుండా కాపాడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సర్వేకు సంబంధించిన రిపోర్టు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని తెలుస్తోంది. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలను అధిగమించడం కూడా రైతు భరోసా నిధుల విడుదల ఆలస్యానికి కారణంగా అధికారులు చెబుతున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ప్రతీయేటా రెండు దఫాలు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. అయితే, రైతు బంధు పథకంలో అనేక లోపాలు ఉన్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. సాగుకు పనికిరాని కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, కమర్షియల్ ప్లాట్లకు కూడా గతంలో పంట పెట్టుబడి సాయం అందేవి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటన్నింటిని రైతు భరోసా పథకం నుంచి తొలగించింది. కేవలం పంటల సాగు చేసే రైతుల బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేస్తోంది. అయితే, ప్రస్తుతం రబీ సీజన్లో శాటిలైట్ సర్వే ద్వారా పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేలా చర్యలు చేపడుతోంది.

తొలుత సంక్రాంతి పండుగకు ముందే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు పేర్కొన్నప్పటికీ.. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుత అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు 65లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా తేలే అవకాశం ఉంది. ఎకరానికి రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ యాసంగి సీజన్లో సుమారు కోటి ఎకరాలకుపైగా రైతు భరోసా పథకం వర్తించనుండగా.. దీనికికోసం సుమారు 9వేల కోట్లు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.

ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో 1.06కోటి ఎకరాలకు, 69.40 లక్షల మంది రైతులకు రూ.8,744 కోట్లు పంపిణీ చేసింది. ఈసారి సాగుదారులకే రైతు భరోసా నిధులు అనే నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్య స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి శాటిలైట్ ఆధారిత డేటాతో పారదర్శకత పెరగడమే కాకుండా ప్రజాధనం వృథా కాకుండా కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధుల సర్దుబాటు చెయ్యడం కూడా రైతు భరోసా ఆలస్యానికి కారణంగా అధికారులు చెబుతున్నారు.
