Future City
Telangana Govt: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో తెలంగాణలో ఫోర్త్ సిటీ అభివృద్ధి అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఫ్యూర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) శరవేగంగా అడుగులు వేస్తోంది. అయితే, ప్రస్తుతం ఫ్యూచర్ సిటీగా ఉన్న పేరును మార్పుచేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ శివారు ప్రాంతాలైన ఆమన్ గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, యాచారం, మంచాల్ ఏడు మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాలు ఎఫ్ సీడీఏ పరిధిలోకి తీసుకొచ్చారు. గతంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి అథారిటీ (హెచ్ఎండీఏ), స్థానిక సంస్థల పరిధిలో వాణిజ్య క్రయ విక్రయాలకు అనుమతులు పొందాల్సి ఉండేది. తాజాగా.. హెచ్ఎండీఏ నుంచి ఎఫ్‌సీడీఏ కమిషనర్ కు అధికారాలు బదిలీ చేశారు. దీంతో జూన్ నుంచి ఎఫ్‌సీడీఏ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఫ్యూచ్ సిటీలో ఓపెన్ ప్లాట్ లేఔట్లు, నివాస, వాణిజ్య భవన నిర్మాణాల అనుమతులతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు ఎఫ్‌సీడీఏ అనుమతులు మంజూరు చేయనుంది. వీటితోపాటు పరిశ్రమలు, ఐటీ, ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులకు భూ కేటాయింపుల బాధ్యత కూడా ఎఫ్‌సీడీఏనే నిర్వహించనుంది.
ఫ్యూచర్ సిటీ పేరును మార్పు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ, యంగ్ ఇండియా పోలీసు స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనిర్శిటీల పేర్ల తరహాలోనే ఫ్యూచర్ సిటీకి కూడా జాతీయ స్థాయిలో గౌరవం పొందేలా ఫ్యూచర్ సిటీని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’గా పేరు మార్పు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. దీంతో జాతీయ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా ఆ ప్రాంతం మారుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.