TGSRTC Strike: ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం.. కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం..

కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తక్షణమే ఒకటి లేదా రెండు డీఏల చెల్లింపునకు ఓకే చెప్పింది ప్రభుత్వం.

  • Updated on- April 25, 2026 / 01:05 AM IST

TGSRTC Strike: తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం అయ్యాయి తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య సుదీర్ఘంగా దాదాపు 12 గంటల పాటు చర్చలు కొనసాగాయి. కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచిన దాదాపు 32 డిమాండ్లపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో కార్మికులు సమ్మె విరమించేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 10శాతం పీఆర్సీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే సంఘాల ఎన్నికలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం మొదటి షిఫ్ట్ నుంచే ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కనున్నాయని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ అయ్యింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మంత్రుల బృందం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య దాదాపు 12 గంటల పాటు చర్చలు జరిగాయి. ఆర్మీసీ కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య జరిగిన చర్చల్లో దశాబ్దాల విలీన సమస్యకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది.

అంతకుముందు ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వ అధికారుల కమిటీ చర్చలు జరిపింది. ఈ భేటీలో 32 డిమాండ్లు ప్రస్తావనకు వచ్చినా ప్రధానంగా మూడు డిమాండ్లపైనే ఆర్టీసీ జేఏసీ చర్చించినట్లు సమాచారం. ఇందులో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నిర్ణయం తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరాయి. మరోవైపు పీఆర్సీ, పీఏ బకాయిల చెల్లింపులపైనా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు జేఏసీ నేతలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి నెలకు 400 కోట్లు చెల్లించాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది.