KishanReddy On Bhoiguda Incident : బోయిగూడ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి-కిషన్‌రెడ్డి

బోయిగూడ అగ్నిప్రమాద ఘటన అంశాన్ని సీరియస్ గా పరిగణించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా..(KishanReddy On Bhoiguda Incident)

Kishanreddy On Bhoiguda Incident

KishanReddy On Bhoiguda Incident : తెలంగాణ ప్రభుత్వం బోయిగూడ అగ్నిప్రమాద ఘటన అంశాన్ని సీరియస్ గా పరిగణించాలని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బోయిగూడలో అగ్ని ప్రమాదానికి గురైన టింబర్ డిపోను కిషన్ రెడ్డి పరిశీలించారు.

జనావాసాల్లో ఉన్న అనుమతుల్లేని గోదాములపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బోయిగూడ అగ్నిప్రమాద ఘటనలో 11 మంది మృతి చెందడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించడంతో పాటు, బీహార్‌ ప్రభుత్వం కూడా మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయాన్ని అందించిందని కిషన్ రెడ్డి తెలిపారు.(KishanReddy On Bhoiguda Incident)

బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. గోదాముల్లో, టింబర్‌ డిపోల్లో రాత్రి వేళల్లో కార్మికులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.

‘బీహార్ నుండి వచ్చిన 11 మంది కార్మికులు చనిపోవడం బాధాకరం. ఈ సంఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి. గతంలో ఓల్డ్ సిటీలో ఇలాంటి ఘటనే జరిగి పేద కార్మికులు చనిపోయారు. వేర్ హౌస్ లో, పని స్థలంలో నివసిస్తూ వెట్టి చాకిరి చేస్తున్నారు. రాత్రి సమయంలో కార్మికులు పని స్థలంలో పడుకోకుండా చూడాలి. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఇలాంటి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలి.

Bhoiguda Fire Accident: బోయిగూడ అగ్నిప్రమాదానికి కారణం కనిపెట్టిన అధికారులు

భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు, జీహెచ్ఎంసీ, ఫైర్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలి. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం చేసింది. బీహార్ ప్రభుత్వం కూడా సాయం చేసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో మాట్లాడి బాధిత కుటుంబాలకు ఇళ్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాను’ అని కిషన్ రెడ్డి అన్నారు.

సికింద్రాబాద్‌ పరిధిలోని బోయిగూడలో మార్చి 23న జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐదు బృందాలతో వివిధ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినప్పటికీ వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఇప్పటికే ఫైర్ సేఫ్టీ, క్లూస్ టీమ్స్ కీలక ఆధారాలు సేకరించారు. 60 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించిన పోలీసులు… మృతుల కుటుంబసభ్యుల నుంచి కూడా స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. రెండురోజులుగా పరారీలో ఉన్న గోదాం యజమాని సంపత్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో యజమాని సుధాకర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదం నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ప్రేమ్‌కుమార్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Fire Accident: బోయిగూడలో భారీ అగ్ని ప్రమాదం, పలువురు సజీవ దహనం

తుక్కుగోదాములో జరిగిన అగ్నిప్రమాద ఘటన తాలూకు కారణాలపై క్లూస్ టీం సహాయంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అగ్నిప్రమాదం సంభవించిన తుక్కుగోదాములో.. ఎలక్ట్రానిక్ త్రీడీ స్కానర్ తో క్లూస్ టీం వివరాలు సేకరించింది. గోదాములోని కింది భాగంలో విద్యుత్ బోర్డులు, ఫ్యూజ్ లు అమర్చిన చోట లభించిన ఆధారాలను పరిశీలించిన అధికారులు.. విద్యుత్ బాక్స్ లో అమర్చిన ఫ్యూజ్ లలో ఒక ఫ్యూజ్ లేకపోవడం గమనించారు. దీంతో ఇక్కడే నిప్పురవ్వలు చెలరేగి గోదాం అగ్నికి ఆహుతైనట్లు అధికారులు ప్రాధమికంగా తేల్చారు. మరింత దర్యాప్తు కోసం గోదాములోని విద్యుత్ బాక్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కి తరలించారు.

మార్చి 23న తెల్లవారుజామున సంభవించిన ఈ ఘోర ప్రమాదంలో వలస కూలీలు మృతి చెందారు. ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గోదాములో చెలరేగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి.. అక్కడే ఉన్న స్క్రాప్ తగలబడింది. అనంతరం గదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ కు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత అధికమైనట్లు ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దట్టంగా మంటలు వ్యాపించడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారని, కిందకు దిగేందుకు ఇనుప మెట్లు ఉన్నా.. మంటల తీవ్రతతో అవి వేడెక్కడంతో వారు కిందకు దిగలేకపోయి ఉంటారని అధికారులు భావించారు.