Telangana Govt : ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ విషయంలో వెనక్కు తగ్గిన తెలంగాణ సర్కార్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
Telangana Govt : ఇంటర్ విద్యపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ విద్యను టెన్త్ బోర్డులో విలీనం చేసే ప్రక్రియను నిలిపివేసింది.
- Harish Thanniru
- Updated on- May 10, 2026 / 02:32 PM IST
Intermediate students
Telangana Govt : ఇంటర్ విద్యపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి సీబీఎస్ఈలో మాదిరే 11, 12 తరగతులు నిర్వహించాలని, ఫలితంగా డ్రాఫౌవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఇంటర్మీడియట్ ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. రెండుమూడు రోజుల్లో ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తుందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే, తాజాగా.. ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనంపై విద్యాశాఖ అధికారులు వెనక్కు తగ్గారు.
Also Read : CM Vijay : సీఎంగా ప్రమాణం తరువాత విజయ్ పొలిటికల్ స్పీచ్‌లో 10 పంచ్ డైలాగ్స్ ఇవే..
సీబీఎస్ఈతో పాటు మెజారిటీ రాష్ట్రాలు 11, 12 తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీడియట్‌కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరడం లేదు. పదో తరగతితో విద్యను నిలిపివేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ను వేరుగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గతంలో అధికారులకు సూచించారు.
ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సైతం తన నివేదికలో పేర్కొంది. ఇటీవల ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, విద్యా శాఖ కమిషనర్ యోగితా రాణాలతో చర్చించారు. విలీనంతో ముడిపడిన పలు సాంకేతిక సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించారు.
విలీన ప్రక్రియకు సంబంధించి భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి తన నివేదిక సమర్పించాలని సీఎం సూచించారు. అనంతరం శాసనసభలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
