HMRL New Board: హైదరాబాద్ మెట్రోపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. IAS, IPSలతో కొత్త బోర్డు.. ఇక పూర్తిగా సర్కార్ పరం

మెట్రో నిర్వహణ, యాజమాన్య బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Updated on- April 25, 2026 / 09:46 PM IST

HMRL New Board: హైదరాబాద్ మెట్రో రైల్ పై తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ఎల్ అండ్ టీ 100శాతం ఈక్విటీ వాటాలను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 30 నాటికి 15వేల కోట్ల డీల్ పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో మెట్రో ఇక సర్కార్ పరిధిలోకి వచ్చింది. నగరవాసులు ప్రధాన రవాణ వ్యవస్థ అయిన హైదరాబాద్ మెట్రోపై ఇక పూర్తి అధికారాలు సర్కార్ కే చెందనున్నాయి. మెట్రో నిర్వహణ, యాజమాన్య బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో భవిష్యత్ ప్రణాళికలు, విస్తరణ, నిర్వహణ బాధ్యతలను ఈ కొత్త బోర్డు పర్యవేక్షించనుంది. ఇందుకోసం జీవో నెంబర్ 128 విడుదల చేసింది.

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నూతన చైర్మన్ గా సీఎస్ రామకృష్ణరావును ప్రభుత్వం నియమించింది. సర్ఫరాజ్ అహ్మద్ ను ఎండీగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్లుగా జయేశ్ రంజన్, వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, డీజీపీ శివధర్ రెడ్డి, సర్ఫరాజ్ అహ్మద్, అశోక్ రెడ్డి, జితేశ్ వి పాటిల్ ను నియమించింది. మేనేజింగ్ డైరెక్టర్ గా శివేంద్ర ప్రతాప్ ను నియమించింది. మెట్రోను మరింత లాభసాటిగా మార్చడం, రెండో దశ విస్తరణ పనులను వేగవంతం చేయడంపై కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు దృష్టి సారించనున్నారు. మెట్రో నిర్వహణలో ఎల్ అండ్ టీ సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, రాయితీలకు సంబంధించిన వివాదాలకు ఈ నిర్ణయంతో తెరపడనుంది.

ఈక్విటీ బదిలీ ద్వారా మెట్రోపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ లభించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎల్ అండ్ టీకి సంబంధించిన 15వేల కోట్ల రూపాయల వాటాను కొనుగోలు చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఐఎఫ్ఆర్ సీ నుంచి 13వేల 615 కోట్ల రూపాయలను ప్రభుత్వం రుణంగా తీసుకోనుంది. ఈ మొత్తాన్ని 20 ఏళ్ల కాల పరిమితిలో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పని చేస్తున్న పలువురు ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

టాప్ IAS, IPS అధికారులతో కొత్త బోర్డు ఏర్పాటు..
కె.రామకృష్ణరావు, IAS-చైర్మన్
సర్ఫరాజ్ అహ్మద్, IAS-మేనేజింగ్ డైరెక్టర్
జయేష్ రంజన్, IAS-డైరెక్టర్
వికాస్ రాజ్, IAS-డైరెక్టర్
సందీప్ కుమార్ సుల్తానియా, IAS-డైరెక్టర్
బి.శివధర్ రెడ్డి, IPS (DGP)-డైరెక్టర్
సర్ఫరాజ్ అహ్మద్ (HMDA కమిషనర్)-డైరెక్టర్
అశోక్ రెడ్డి, IAS (HMWS&SB MD)-డైరెక్టర్
జితేష్ వి. పాటిల్, IAS (TSSPDCL CMD)-డైరెక్టర్
శివేంద్ర ప్రతాప్, IAS-జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్

Also Read: కవిత కాకుండా దేశంలో మహిళలు పెట్టిన పార్టీలు ఇవే.. వాటిలో సక్సెస్ అయినవి..