Basara Temple Redevelopment : బాసర ఆలయానికి మహర్దశ.. రూ.225 కోట్లతో.. 9 అంతస్తుల్లో రాజగోపురం
Basara Temple Redevelopment :
- Dharani Pilli
- Published On : April 6, 2026 / 12:10 PM IST
telangana govt release redevelopment master plan basara saraswati temple and allocate rs 225 crore
- బాసర సరస్వతి ఆలయానికి మహర్దశ
- రూ.225 కోట్లతో ఆలయ పునరాభివృద్ధి
- నేడు భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్
Basara Temple Redevelopment : రేవంత్ సర్కార్ రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయంతో పాటు కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, బాసర సరస్వతి ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే రూ. 200 కోట్లతో సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే ప్రాంతంలో శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రూ. 225 కోట్లతో బాసర ఆలయ పునరాభివృద్ధి పనులు చేపట్టేందుకు అంగీకారం తెలిపారు. ఇప్పటికే మాస్టర్‌ప్లాన్ రెడీ అయింది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం.. బాసర ఆలయ రీడెవలప్‌మెంట్‌లో భాగంగా ఒక మోడల్‌ని రిలీజ్ చేసింది. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ఇబ్బంది లేకుండా.. ఈ మాస్టర్ ప్లాన్‌లో పలు అభివృద్ధి పనులు చేయనున్నారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్షరాభ్యాసం అనగానే బాసర ఆలయమే గుర్తుకు వస్తుంది. ఈ క్రమంలో బాసరలో ఆచారాలకు అనుగుణంగా రాజగోపురం, ధ్యాన మందిరాలు, కోనేరు నిర్మించడంతో పాటు, ఉత్తర ద్వారం అభివృద్ధి చేయనున్నారు. ఆలయ పునరాభివృద్ధిలో భాగంగా ముందుగా అధికారులు శృంగేరి పీఠాధిపతులను సంప్రదించి.. ఆ తర్వాత గుడి పునఃనిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు. గర్భాలయం, అర్ధ మండపం, రాజ గోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల నుంచి అనుమతులు పొందారు.
- 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధ మండపాన్ని ఏకంగా 5 వేల చదరపు అడుగులకు పెంపు.
- ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం.
- మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు.
- 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల్లో మాడ వీధులు.. ఉత్తర ద్వారాన్ని నిర్మించనున్నారు.
- మొత్తంగా ఇప్పుడు ఉన్న 20 వేల చదరపు అడుగుల బాసర ఆలయ విస్తీర్ణాన్ని.. పునరాభివృద్ధిల భాగంగా.. 62 వేల చదరపు అడుగులకు పెంచబోతున్నారు.
దీంతో గతం కంటే 3 రెట్లు విశాలంగా ఆలయం కనిపించనుంది. ఆలయ పునఃనిర్మాణంలో భాగంగా ప్రతి నిర్మాణాన్ని శిలలతోనే చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే సుమారు 6 వేల మంది భక్తుల కోసం టాయిలెట్స్, ఫీడింగ్ రూమ్స్, ఫుడ్ స్టాల్స్ వంటి వాటితో 70 వేల చదరపు అడుగుల వైశాల్యంతో క్యూ కాంప్లెక్స్‌లు నిర్మించబోతున్నారు. అలాగే ఒకేసారి సుమారు 200 మంది కూర్చుని ధ్యానం చేసుకునేందుకు వీలుగా ధ్యాన మందిరం నిర్మించబోతున్నారు.
వీటితో పాటు:
- 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో భారీ వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం.
- ఈశాన్య దిక్కున కోనేరు.
- తూర్పు దిక్కున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం.
- దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్ల నిర్మాణం.
- దేవాలయం నుంచి అవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్.
- అవతలి వైపున సోలార్ రూఫ్‌టాప్‌తో వాహనాల పార్కింగ్.
- ఆలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులను ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా చేపట్టనున్నారు.
