Salkam Lake Case : ఒవైసీ కాలేజీకి క్లీన్చిట్.. ఎఫ్టీఎల్ మీ ఇష్టమొచ్చినట్లు మార్చేస్తారా..? హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
Salkam Lake Case : ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనం సల్కం చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో లేదని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది.
Telangana government gives clean chit to Owaisi college High Court makes key observations
- ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ చెరువు ఎఫ్టీఎల్లో లేదు
- హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- ఎఫ్టీఎల్ మీ ఇష్టమొచ్చినట్లు మార్చేస్తారా..?
- కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
Salkam Lake Case : ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ భవనం సల్కం చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో లేదని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. అయితే, ప్రభుత్వం సమర్పించిన నివేదికపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సమర్పించిన నివేదికలను పరిశీలించిన హైకోర్టు.. మ్యాప్స్ చూస్తే ఆక్రమణ స్పష్టంగా కనిపిస్తోంది కదా? గతంలో ఉన్న ఎఫ్టీఎల్ పరిమితి ఇప్పుడు ఎలా తగ్గింది? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
Also Read : Tihar Jail Food : జైల్లో భోజనం తినలేకపోతున్నా.. పాస్తా, ఆలివ్ ఆయిల్ కావాలి.. కోర్టును కోరిన అమెరికన్ ఖైదీ..
అలాగే తమకు నచ్చిన వారి నిర్మాణాలను కూల్చకుండా వదిలేస్తున్నారా? అంటూ ప్రభుత్వ తీరుపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చెరువుల పరిరక్షణలో హైడ్రా (HYDRAA) చేపడుతున్న చర్యలపై కూడా న్యాయస్థానం వివరణ కోరింది. ఈ కేసుకు సంబంధించి మున్సిపల్ శాఖ, హెచ్ఎండీఏ ఇప్పటివరకు నివేదికలు సమర్పించకపోవడంపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించింది.
ఈ సందర్భంగా ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థల భవనాలపై గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకుంది. సల్కం చెరువు ఆక్రమణల వ్యవహారంపై తదుపరి విచారణను వాయిదా వేస్తూ, ఎఫ్టీఎల్ పరిమితులు ఎలా మారాయనే అంశంపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఒవైసీ విద్యా సంస్థను సల్కం చెరువు ఎఫ్టీఎల్ ఆక్రమించి కట్టారని పేర్కొంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగింది. సల్కం చెరువుకు సంబంధించి రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా నిర్వహించి రూపొందించిన నివేదికను ఏఏజీ హైకోర్టుకు సమర్పించారు. ఈ రిపోర్టును, సంబంధించిన మ్యాపులను పరిశీలించిన ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. గత కాస్ర పహాణీల్లో చెరువు విస్తీర్ణం 39 ఎకరాలుగా రికార్డయి ఉంది. 2016లో సల్కం చెరువు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు ఉన్న ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎలా తగ్గింది? పదేళ్లుగా ఈ చెరువు ఎఫ్టీఎల్పై తుది నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు?’ అంటూ నిలదీసింది.
