తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్.. మార్గదర్శకాలివే..

  • Publish Date - November 4, 2020 / 06:48 AM IST

second wave of covid-19 : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ‘సెకండ్‌ వేవ్‌’ మొదలైంది. కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మొదటి దశలో కరోనాను నియంత్రించినట్లుగానే రెండో దశను అదే స్థాయిలో ఎదుర్కోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.



తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2.42 లక్షలకు చేరింది. రాష్ట్రంలో మార్చి 2 నుంచి కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా కోలుకునేవారి రేటు 92.12 శాతానికి చేరుకోవడం ఊరట కలిగించే విషయమే.. ఆసుపత్రుల్లో చేరే కరోనా పేషెంట్ల సంఖ్య కూడా పడిపోయింది.



కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కరోనా పూర్తి నియంత్రణకు వచ్చే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఈ కాలంలో సీజనల్‌ ఫ్లూ వ్యాధులు, కరోనా విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ టెస్టుల సంఖ్యను పెంచాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
https://10tv.in/hyderabad-gets-relief-from-floods-but-threat-of-endangered-diseases/
ప్రధానంగా రద్దీ ప్రాంతాల్లో మొబైల్‌ టెస్టింగ్‌ వాహనాలతో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించనున్నారు. యూరప్, అమెరికా దేశాల్లో సెకండ్‌ వేవ్‌ మొదలైంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేసింది. అందుకే జిల్లాలపై ఫోకస్‌ పెట్టింది. పరిస్థితిని అంచనా వేసి యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేస్తోంది.



కరోనా మార్గదర్శకాలివే..
* అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దు.
* పండుగలు, శుభకార్యాల్లో అందరూ ఒకేచోట చేరొద్దు.. ఎవరికి వారే కుటుంబంలో జరుపుకోవడం మంచిది.
* చలికాలంలో డెంగీ, మలేరియా ఫ్లూ జ్వరాలతో కరోనా అవకాశముంది. లక్షణాలున్నా అశ్రద్ధ చేయొద్దు.
* కరోనా లక్షణాలుంటే వెంటనే నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.
* సాధారణ లక్షణాలు అయితే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి.
* ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలి. ఇంట్లో కనీసం 2 మీటర్ల దూరాన్ని పాటించాలి.
* ఐసోలేషన్‌లో గదికి గాలి వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి.
* జ్వరాన్ని చెక్‌ చేసుకోవాలి. శ్వాస సంబంధ సమస్యలు వస్తే తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలి.
* ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి.. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి.
* ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికి వెళ్లేవారు ప్రజా రవాణా వ్యవస్థలో వెళ్లకూడదు.
* కూరగాయలు, పండ్లను బేకింగ్‌ పౌడర్‌ కలిపిన నీటితో కడగాలి.
* ఇంట్లో వండిన ఆహార పదార్థాలనే తీసుకోవాలి.
* రోజుకు తప్పనిసరిగా 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి.
* పసుపు వేడి పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలి.