Telangana MLC Elections 2026 : తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ రేసు.. ఆరుగురి పేర్లు ఢిల్లీకి! హైకమాండ్ ప్రకటనపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ
Telangana Graduate MLC Elections 2026 : తెలంగాణలో నల్గొండ - వరంగల్ - ఖమ్మం, హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది.
- Harish Thanniru
- Updated on- September 27, 2026 / 08:13 AM IST
Telangana Graduate MLC Elections 2026
Telangana Graduate MLC Elections 2026 : తెలంగాణలో నల్గొండ – వరంగల్ – ఖమ్మం, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. నల్గొండ – వరంగల్ – ఖమ్మం స్థానం నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నపీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవి పదవీకాలం మార్చి నెలలో పూర్తికానుంది. దీంతో ఆయా స్థానాలకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు వేగవంతం చేసింది.
నల్గొండ–వరంగల్–ఖమ్మం నియోజకవర్గానికి అభ్యర్థుల ఎంపిక బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ నియోజకవర్గం అభ్యర్థుల ఎంపిక బాధ్యత మంత్రి దామోదర్ రాజనర్సింహకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, వీరు సామాజిక వర్గాలు, స్థానికంగా ఉన్న పరిస్థితులు పరిగణలోకి తీసుకొని ముగ్గురేసి చొప్పున రెండు నియోజకవర్గాలకు కలిపి ఆరుగురు పేర్లను ఫైనల్ చేసి.. రాష్ట్ర పార్టీ అధిష్టానంకు పంపించారు. పీసీసీ ఆ జాబితాను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు పంపించినట్లు తెలిసింది.
ఈనెల 29వ తేదీన సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేయడం జరుగుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో బరిలో నిలిచేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావహులు అధికంగానే ఉన్నారు. వీరిలో కొందరు రాష్ట్ర స్థాయిలోనేకాక ఢిల్లీ స్థాయిలోని నేతల ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహలు ఒక్కో స్థానం నుంచి ముగ్గురు పేర్లను ఫైనల్ చేసి పంపించడంతో వారిలో ఒకరిని ఢిల్లీ పెద్దలు ఫైనల్ చేయనున్నారు.
నల్గొండ–వరంగల్–ఖమ్మం సీటుకు సూర్యాపేట జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి, ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాస్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ పేర్లను పీసీసీ సిఫారసు చేసినట్లు తెలిసింది.
అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సీటు నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి, పీసీసీ మీడియా కమిటీ మాజీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి, విద్యా సంస్థల చైర్మన్ గౌరీ సతీశ్ పేర్లను హైకమాండ్‌కు సిఫార్సు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ఈ ఆరుగురిలో ఇద్దరి పేర్లను ఫైనల్ చేస్తారని సమాచారం. అయితే, చివరి నిమిషంలో కొత్త వారి పేర్లుసైతం తెరపైకి రావచ్చునని, మొత్తానికి ఈనెల చివరి వారంలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి ఇద్దరు అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
