Telangana Rain Alert : తెలంగాణలో వేగంగా మారుతున్న వాతావరణం.. నేడు, రేపు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ..
Telangana Rain Alert : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Telangana Rains
Telangana Rain Alert : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత వారం రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే, నేడు, రేపు కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read : CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు ప్రదానం
శని, ఆదివారాల్లో కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో గురువారం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆయా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు.
మరోవైపు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ, రేపు ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదంటే ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు జాగ్రత్తలు వహించాలని సూచించారు.
ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా వేడి వాతావరణం నెలకొనే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
