Telangana Weather Today : గర్జిస్తున్న మేఘాలు.. తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. ఆ ఏరియాల్లో మాత్రం ఎండలు.. కారణమిదే..

Telangana Weather Today : తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Telangana Weather Update Today _

  • తెలంగాణలో చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
  • నేడు ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ

Telangana Weather Today : తెలంగాణలో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వచ్చే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు.. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు.. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read : Governor Review: ‘గవర్నర్’ మూవీ రివ్యూ.. 1991లో RBI గవర్నర్ ఏం చేశారు? అప్పుడు ఏం జరిగింది?

ఇవాళ తెలంగాణలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేయగా.. శనివారం హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా కల్లూరులో 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే, వర్షాల సమయంలో, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు వద్ద, హోర్డింగుల వద్ద ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు.. తెలంగాణలో వర్షాలతోపాటు పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు.. ఈ ఏడాది తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, రైతులు వర్షాలు చూసుకుని పంటల సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.