Indiramma Flats Draw: ‘ఇందిరమ్మ ఫ్లాట్ల’ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. లాటరీ ప్రక్రియకు ముహూర్తం ఫిక్స్.. ఏ రోజంటే?
ఇందిరమ్మ(Indiramma Flats Draw) ఎల్‌ఐజీ ఫ్లాట్ల కేటాయింపునకు, మిగిలిన రద్దు ఫ్లాట్లకు ఆన్‌లైన్ ఇ-లాటరీ తీయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రకటించింది.
- V Santhosh Kumar
- Published on- October 31, 2026 / 09:34 PM IST
Telangana housing board to draw lots for indiramma lig flats on nov 3 and 4
Indiramma Flats Draw: హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలోని ఇల్లు లేని పేదలకు సొంతింటి కలను నిజం చేస్తూ హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. మరో నాలుగు నియోజకవర్గాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల కేటాయింపు కోసం నవంబరు 3వ తేదీన డ్రా(Indiramma Flats Draw) నిర్వహించనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ వెల్లడించారు. ముషీరాబాద్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్ నియోజకవర్గాల పరిధిలోని ఇందిరమ్మ టవర్లలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ డ్రా ద్వారా ఫ్లాట్లను పారదర్శకంగా కేటాయించనున్నారు.
నవంబరు 4న మిగిలిన ఫ్లాట్లకు మాప్-అప్ డ్రా.. హౌసింగ్ బోర్డు స్పష్టత:
గతంలో 16 నియోజకవర్గాల్లో కేటాయించిన ఫ్లాట్లలో అర్హత లేకపోవడం, నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించకపోవడం వంటి వివిధ కారణాలతో రద్దయిన ఇళ్లకు నవంబరు 4న మాప్-అప్ లాటరీ తీయనున్నారు. గతంలోనే దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్న అర్హులైన వారికి ఈ డ్రాలో ప్రాధాన్యం ఇస్తామని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఖాళీగా తేలిన ఇళ్లను ఈ ప్రక్రియ ద్వారా పూర్తిస్థాయిలో భర్తీ చేయనున్నారు.
యూట్యూబ్‌లో ఇ-లాటరీ ప్రత్యక్ష ప్రసారం.. పూర్తి పారదర్శకత:
ఈ రెండు లాటరీ ప్రక్రియలను పూర్తిగా ఆన్‌లైన్ (ఇ-లాటరీ) పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. లబ్ధిదారులకు ఎలాంటి అనుమానాలు లేకుండా పారదర్శకత కోసం డ్రా ప్రక్రియ మొత్తాన్ని యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు గౌతమ్ తెలిపారు. దరఖాస్తుదారులు ఇళ్ల నుంచే లాటరీ ఫలితాలను ప్రత్యక్షంగా తిలకించవచ్చని సూచించారు.
