Kavitha
Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకుంటానని చెప్పారు. తనకు సెంటిమెంట్ ఎక్కువ.. మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాం. కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా కవిత తెలిపారు. బీఆర్ఎస్‌తో తనకు ఒరిగిందేమీ లేదని స్పష్టం చేసిన కవిత.. భవిష్యత్తులో తన రాజకీయ ప్రయాణం పూర్తిగా ప్రజల మద్దతుపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు.
Also Read : Gold and Silver Rates Today : భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. రాత్రికిరాత్రే ఢమాల్.. నేటి ధరలు ఇవే..
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం అంత యాక్టివ్‌గా లేదని కవిత అన్నారు. పెద్ద నాయకులు ఆ పార్టీని గాలికి వదిలేశారా..? బీఆర్ఎస్ పార్టీ నేతలెవరూ కిందిస్థాయిలో క్రియాశీలంగా లేరని కవిత అన్నారు. కృష్ణార్జునులు రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడం లేదని కవిత ప్రశ్నించారు. జాగృతి సంస్థ పోటీ చేస్తున్న ప్రాంతాల్లో హరీశ్ రావు ఎందుకు తిరుగుతున్నారని నిలదీశారు. అలాగే కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికే ఎందుకు పరిమితం అయ్యారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రమంతా వారు ప్రచారం చేయడం లేదంటే.. వారు రాష్ట్రస్థాయి నేతలు కారా? అని కవిత అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని కవిత అన్నారు. తనపై విమర్శలు చేస్తున్న వారిపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటనక్క, గూఢచారి వంటి పేర్లు వారికి నప్పుతాయి కాబట్టే అలా పిలుస్తున్నానని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, కానీ, వ్యక్తిగత ఆరోపణలు చేస్తే తాను కూడా మౌనంగా ఉండబోనని కవిత స్పష్టం చేశారు.