ఆదివాసీ భూముల్లో తవ్వకాలు : కొడవళ్లు, విల్లంబులు, బాణాలతో కదం తొక్కిన అడవిబిడ్డలు

  • Publish Date - December 5, 2020 / 03:22 PM IST

Telangana:తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ బాద్ జిల్లా బావురుగొండలో ఆదివాసీలు ఆందోళన బాటపట్టారు.
కడుపు మండిన ఆదివాసీలు కదం తొక్కారు. సంప్రదాయ ఆయుధాలతో ర్యాలీ నిర్వహించారు. తమ హక్కులను కాపాడుకునేందు కర్రలు,కత్తులు,బరిసెలు,విల్లంబులతో కదం తొక్కారు. ఈ ఆందోళన పాల్గొన్న ఆదివాసీ మహిళలు చీపుళ్లు పట్టుకున్నారు.



బావురుగొండ నుంచి పోడుభూముల వరకూ ర్యాలీ నిర్వహించారు. ఆయుధాలతో ఆందోళన బాట పట్టిన ఆదివాసీలను చూసిన అధికారులు ఉలిక్కిపడ్డారు. అధికారుల తీరును నిరసిస్తూ అడవిబిడ్డలు కందకాల తవ్వకాలను వదిలేసి వెనక్కి మళ్లారు. పారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు నశించాలి..ఆదివాసీ హక్కుల వర్థిల్లాలి అని నినాదాలు చేస్తూ ర్యాలిని నిర్వహించారు.



వివరాల్లోకి వెళితే..మెహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం బావురుగొండలో ఆదివాసీల భూములు వివాదంగా మారాయి. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూముల్ని పోడుభూముల పేరుతో అధికారులు కందకాలు తవ్వారు. గత వారం రోజులుగా ఈ భూముల్లో ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వుతున్నారు.



దీంతో గత వారం రోజులుగా ఆదివాసీలు నిరసనలు చేపట్టంతో అవి ఈరోజు పతాకస్థాయికి చేరుకున్నాయి. తాము ఎన్నో ఏళ్లగా వ్యవసాయం చేసుకునే భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసీలు అధికారుల్ని కోరుతున్నారు. కానీ అధికారులు పట్టాలు ఇవ్వకపోగా ఆ భూముల్లో వారికి ఎటువంటి హక్కులు లేవని చెబుతున్నారు. పైగా ఆ భూముల్లో కందకాలు తవ్వుతున్నారు. దీంతో ఆదివాసీలు అధికారుల తీరును నిరసిస్తు ఆయుధాలు చేపట్టి..కత్తులు, కర్రలు, విల్లంబులు, బాణాలు, బరిసెలు,చీపుళ్లు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు.



ఆదివాసీల పోరాటానికి సీపీఐఎంఎల్,కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. ర్యాలీలో పలువురు కమ్యూనిస్టు నేతలు పాల్గొన్నారు. ఆదివాసీ హక్కుల్ని అమలు చేయాలని తమ భూముల జోలికి రావద్దని లేదంటే తమ పోరాటాన్ని ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు. మేం సాగు చేసుకునే భూముల్లో అధికారులు కందకాలు తవ్వటం నిలివేయాలని లేదంటే పోరాటం అంటే ఏమిటో..అధికారులకు తెలియజేస్తామని హెచ్చరించారు అడవిబిడ్డలు.