Harish Rao Thanneeru : మీ గ్యారెంటీలు దేవుడెరుగు, మీకసలు ఓట్లు పడతాయా? తెలంగాణ ఎవరి దయతోనో రాలేదు- కాంగ్రెస్ అగ్రనేతలపై మంత్రి హరీశ్ రావు ఫైర్
నెత్తి నాది కాదు.. కత్తినాది కాదు. అధికారంలోకి వచ్చేది ఉందా? ఇచ్చేది ఉందా? అనుకుంటూ బూటకపు హామీలు ఇస్తున్నారు. Harish Rao Thanneeru
- Naveen
- Published On : September 18, 2023 / 12:52 AM IST
Harish Rao Thanneeru (Photo : Facebook, Twitter)
Harish Rao Thanneeru – Congress : తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ సభపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆ సభలో కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన హామలపై ఆయన విరుచుకుపడ్డారు. అలవికాని హామీలు, అబద్ధాల ఆరోపణలు, చరిత్ర వక్రీకరణలు.. కాంగ్రెస్ సభ సాంతం ఆత్మవంచన, పరనిందగా సాగిందని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీలు దేవుడెరుగు, అసలు కాంగ్రెస్ కు ఓట్లు పడతాయనే గ్యారంటే లేదు అని ఆయన అన్నారు. గాలికి పోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో ఇచ్చిన హామీలు అని ఎద్దేవా చేశారు.
”నెత్తి నాది కాదు.. కత్తినాది కాదు. అధికారంలోకి వచ్చేది ఉందా? ఇచ్చేది ఉందా? అనుకుంటూ బూటకపు హామీలు ఇస్తున్నారు. పైగా మీరు చెప్పిన గ్యారెంటీలు కూడా మా కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల్లో నుంచి కాపీ కొట్టినవే. మీది జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా? రాష్ట్రానికో మేనిఫెస్టో ఎందుకు? హైదరాబాద్‌లో చెప్పిన గ్యారెంటీలు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ సీడబ్ల్యూసీలోనే తీర్మానం చేయవచ్చు కదా? ఎందుకు చేయలేదు? మీరిచ్చింది వారెంటీలు లేని గ్యారెంటీలు.
కర్నాటకలో మీరు ఇట్లానే ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయలేక వంద రోజుల్లోనే ఆగం ఆగం అవుతున్నారు. కరెంటు లేదని రైతులు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తున్నారు. ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారు. అక్కడ మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా..? ఏరుదాటక తెప్ప తగలబెట్టే రకం మీరు. తెలంగాణలో ఇచ్చినట్టు మీరు దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలు ఇస్తారా..? ఎందుకు చెప్పలేకపోతున్నారు..? ఎన్నికలపుడు వచ్చుడు.. నోటికి వచ్చింది చెప్పుడే తప్ప మీరు ఇచ్చే గ్యారెంటీలను అమలు చేసేది ఎవరు..?
Also Read..KVP: కేవీపీపై రేవంత్‌రెడ్డికి కోపమెందుకు.. బీఆర్ఎస్‌కు వచ్చిన ఇబ్బందేంటి?
2014లో కాంగ్రెస్ ఇట్లనే భూటకపు హామీలు ఇస్తే 44 ఎంపీ సీట్లు వచ్చాయి. 2019లో 52 వచ్చాయి. రాహుల్ గాంధీ మీ అజ్ఞానానికి జోహార్లు. రాష్ట్రపతి ఎన్నికల్లో మేం బీజేపీకి మద్దతివ్వలేదు. కావాలంటే మీరు పేపర్లు తిరగేసి చూడండి. మేం యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చాం. తెలంగాణకు యశ్వంత్ సిన్హాను పిలిచి భారీ సభ పెట్టాం. మీ నేతలనే అడగండి. అవగాహన పెంచుకోండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా మేము బీజేపీకి మద్దతివ్వలేదు. జీఎస్టీ బిల్లును తెచ్చిందే కాంగ్రెస్. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జీఎస్టీ ఉందా? లేదా? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు..? ఎందుకీ నయవంచక ముచ్చట్లు.
ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తెలియదా..? గుజరాత్ ఎన్నికలపుడు నీ జోడో యాత్ర గుజరాత్‌కు ఎందుకు వెళ్లలేదు..? మా దగ్గర హుజురాబాద్, మునుగోడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నేరుగా.. సిగ్గులేకుండా బీజేపీకి సపోర్టు చేయడం మీకు తెలియదా..?
ఈడీ, సీబీఐలు వేటకుక్కల్లా మా నేతలను వేధిస్తున్నాయి. నీకు కనిపిస్తలేదా..? మా మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఎల్.రమణ, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి తదితరులపై ఈడీ, సీబీఐ పేరుతో బీజేపీ వేధించినది మీకు కనిపిస్తలేదా..? మీకు సంబంధించిన నేషనల్ హెరాల్డ్ కేసు ఎందుకు అటకెక్కిందో చెప్పగలరా..? రాబర్ట్ వాద్రా కంపెనీల అక్రమాలపై బీజేపీ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోలేదు..?
Also Read..Sonia Gandhi: కర్ణాటకకు అప్పుడు 5 హామీలే.. తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించిన సోనియా
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కాంగ్రెస్ నేతపై కూడా ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు లేవు..? బీజేపీ, కాంగ్రెస్ మిలాఖాత్ కావడం ప్రపంచానికి తెల్సిన విషయమే. అవినీతి గురించి మీరు మాట్లాడడమంటే గొంగట్లో కూర్చొని తింటూ వెంట్రుకలు ఏరినట్టుంది. మీ హయాంలో జరిగిన కుంభకోణాల గురించి చెప్పాలంటే వేలున్నాయి. స్కాంల సంస్కృతిని ప్రవేశపెట్టిందే మీరు. మీది కాంగ్రెస్ కాదు.. స్కాంగ్రెస్. బోఫోర్స్ నుంచి దాణా, చక్కర కుంభకోణాలు ఒకటా.. రెండా.. దేశంలో అవినీతికి కేరాఫ్ అడ్రెస్సే మీరు. ఏ కోణంలో చూసినా కాంగ్రెస్‌లో కుంభకోణమే కనిపిస్తుంది. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడితే తోడేలు శాకాహారం గురించి మాట్లాడినట్టు ఉంటుంది. మీరు అంటున్నట్లుగా తెలంగాణ ఎవరి దయతోనూ రాలేదు. ప్రజలు పోరాడి గెలుచుకున్నారు. మీరు దయతో ఇచ్చి ఉంటే వందలాది మంది యువకులు ఎందుకు బలిదానం చేసుకున్నారు” అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు.
