Ponguleti Srinivas Reddy: తెలంగాణ భూ యజమానులకు బిగ్ అప్డేట్.. ‘భూదార్’ నంబర్ల కేటాయింపు వేగవంతం.. 125 ఏళ్ల తర్వాత క్షేత్రస్థాయి రీసర్వే
తెలంగాణలో భూ రీసర్వేలో సర్వే పూర్తయిన గ్రామాల్లో భూదార్ నంబర్ల కేటాయింపు వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) ఆదేశించారు.
- V Santhosh Kumar
- Published on- November 10, 2026 / 07:15 PM IST
Telangana minister ponguleti srinivas reddy review on land resurvey with collectors
Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాష్ట్రంలో తరతరాలుగా పెండింగ్లో ఉన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి, ప్రతి రైతుకు కచ్చితమైన హక్కులు కల్పించాలనే ధ్యేయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వేపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) సచివాలయంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు 125 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న ఈ సమగ్ర సర్వేలో ఏ చిన్న పొరపాటు జరిగినా భవిష్యత్తులో భూ వివాదాలకు దారితీస్తుందని, కాబట్టి అధికారులు అత్యంత కచ్చితత్వం, పారదర్శకతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
416 గ్రామాల్లో పూర్తయిన రీసర్వే.. ‘భూదార్’ నంబర్ల కేటాయింపు వేగవంతం:
తెలంగాణవ్యాప్తంగా తొలిదశలో 2,720 గ్రామాల్లో భూ రీసర్వే చేపట్టగా, ఇప్పటివరకు 1,000కి పైగా గ్రామాల్లో పనులు ప్రారంభమై 416 గ్రామాల్లో ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని మంత్రి వెల్లడించారు. రీసర్వే పూర్తయిన ప్రాంతాల్లో ప్రతి భూకమతానికి ప్రత్యేకంగా ‘భూదార్’ నంబర్లను వేగంగా కేటాయించాలని సూచించారు. రెవెన్యూ రికార్డులను ఆధారంగా చేసుకుని సర్వే పారదర్శకంగా సాగాలని, రైతుల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
రైతుల అభ్యంతరాలకు అవకాశం.. నోటీసుల జారీ తప్పనిసరి:
భూ సర్వే ప్రక్రియ పూర్తయిన వెంటనే సంబంధిత భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు అందజేయాలని, వారి నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించడానికి తగిన సమయం ఇవ్వాలని అధికారులను కోరారు. రీసర్వే విధానం, హద్దుల నిర్ధారణ, వివాదాల పరిష్కారంపై గ్రామ స్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. భూ వివాదాలు లేని తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు.
