Telangana Pension Hike : తెలంగాణ పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్.. రూ.2 వేల పింఛన్‌ రూ.4 వేలకు పెంపు.. మంత్రి కీలక ప్రకటన!

Telangana Pension Hike : తెలంగాణ పింఛన్‌దారులకు భారీ గుడ్ న్యూస్.. చేయూత పథకం కింద ప్రస్తుతం అందిస్తున్న రూ.2 వేల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. పెంపు ఎప్పటినుంచి అమలవుతుందంటే?

Telangana Pension Hike

  • చేయూత పెన్షన్‌దారులకు భారీ శుభవార్త..
  • వృద్ధాప్య పింఛన్లపై ప్రభుత్వం తీపి కబురు..
  • రూ.4 వేలు ఎప్పటి నుంచి వస్తాయంటే?
  • త్వరలోనే రెట్టింపు కానున్న పెన్షన్‌

Telangana Pension Hike : తెలంగాణలో పింఛన్లు పొందుతున్న లక్షలాది మందికి ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పబోతుందా? నెలనెలా వచ్చే పెన్షన్ డబ్బులు పెరుగుతాయా? అంటే తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రూ.2 వేలుగా ఉన్న సామాజిక పింఛన్‌ను రూ.4 వేలకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..

రూ.2 వేల పింఛన్‌ రూ.4 వేలకు పెంచుతారా? :
తెలంగాణలో చేయూత పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన వారికి ప్రభుత్వం ప్రతినెలా పింఛన్లు అందిస్తోంది. అయితే, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్న రూ.2 వేల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. పార్టీ మేనిఫెస్టోలోనూ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. కానీ, ప్రభుత్వం ఏర్పడి ఇన్నాళ్లయినా పెన్షన్ పెంపు అమలులోకి రాకపోవడంతో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు..

కొత్త చేయూత పింఛన్ల పంపిణీ :
ఈ నేపథ్యంలో నల్గొండలోని ఏచూరి గార్డెన్స్‌లో కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లను లబ్ధిదారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని తెలిపారు. ప్రస్తుతం అందిస్తున్న రూ.2 వేల పింఛన్‌ను త్వరలోనే రూ.4 వేలకు పెంచే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గబోమని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామని వెల్లడించారు.

పథకాలన్నీ అమలు చేస్తున్నాం.. :
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులకు ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అయితే, పెన్షన్ పెంపునకు సంబంధించిన కచ్చితమైన తేదీని ఇంకా వెల్లడించలేదు. రూ.4 వేల పింఛన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే అంశంపై లబ్ధిదారుల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తేనే పెంపు అమలు తేదీపై క్లారిటీ రానుంది.