తెలంగాణలో కరోనా మహమ్మారి.. 24గంటల్లో 6వేల కేసులు

తెలంగాణ రాష్ట్రంలోనూ.. మహానగరం హైదరాబాద్‌లోనూ కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఆరు వేలకు పైగా కేసులు నమోదవగా.. ప్రజలకు వణుకు పుట్టిస్తోంది, అధికారులను టెన్షన్ పెడుతోంది. ఒక్కరోజులో 6,542 పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 20మంది చనిపోయినట్లుగా వైద్య ఆరోగ్యశాఖ నివేదించింది.

ఇదే సమయంలో 2,887 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లుగా వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌లో వెల్లడించింది.

రాష్ట్రంలో నిన్న ఒకే రోజు 1,30,105 పరీక్షలు చేయగా.. 6,542 కేసులు వచ్చాయి. లేటెస్ట్‌గా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 898, మేడ్చల్‌లో 570, రంగారెడ్డిలో 532, నిజామాబాద్‌లో 427, సంగారెడ్డిలో 320, నల్గొండలో 285, మహబూబ్‌నగర్‌లో 263, వరంగల్‌ అర్బన్‌ 244, జగిత్యాలలో 230, ఖమ్మం జిల్లాలో 246 మంది మహమ్మారి బారినపడ్డారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,67,901కి చేరగా.. అందులో 3,19,537 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 1,876 మంది ప్రాణాలు కోల్పోయారు.

ట్రెండింగ్ వార్తలు