Village Current Officers : తెలంగాణ సర్కార్ శుభవార్త.. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు.. 12 వేల మందికి కొలువు.. అది కూడా సొంతూర్లోనే..

Village Current Officers : తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కొత్త కొలువుల భర్తీకి సిద్ధమవుతుంది.

telangana Rythu discom recruitment for 12000 village current officers to benefit farmers and youth

  • తెలంగాణ సర్కార్ శుభవార్త
  • రాష్ట్రంలో కొత్తగా విలేజ్ కరెంట్ ఆఫీసర్ కొలువు
  • 12 వేల మందికి ఉద్యోగాలు

Village Current Officers : తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. కొత్త కొలువులను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటుంది.. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో. ఈ కొత్త కొలువుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇంతకీ ఆ కొలువులు ఏంటి అంటే.. విలేజ్ కరెంట్ ఆఫీసర్లు. వీరి విధి ఏంటంటే.. వీరు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ సరఫరా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు. ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్.. ఈ ‘విలేజ్ కరెంట్ ఆఫీసర్ల’ నియామకానికి కసరత్తు చేస్తోంది. కొత్తగా ఏర్పడిన ‘రైతు డిస్కం’లో ప్రస్తుతం క్షేత్రస్థాయి శాశ్వత సిబ్బంది వెయ్యి మందే ఉన్నారు. దీంతో.. ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజులు, లైన్ల మరమ్మతులు ఆలస్యమవుతున్నాయని నిపుణులు ఈఆర్‌సీ (ERC) దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 12 వేల మంది లోకల్ ఎలక్ట్రీషియన్లను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. వీరికి నెలకు రూ. 15,000 కనీస వేతనం అందించనున్నారు. వీరికి వేతనాల కోసం ప్రతి నెలా రూ. 18 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 216 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. శాశ్వత ఉద్యోగులకు అయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఇది తక్కువే కనుక ప్రభుత్వం త్వరలోనే ఈ విలేజ్ కరెంట్ ఆఫీసర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు వేగవంతం చేసింది.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం వల్ల రైతులకు నాణ్యమైన కరెంట్ అందడంతో పాటు.. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 12 వేల మంది గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తుంది. ఇందుకోసం తెలంగాణ సర్కార్ ఏడాదికి రూ. 216 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. గాలివానలు వంటి విపత్తులు వచ్చి కరెంట్ స్తంభాలు కూలిపోతే.. మండల సిబ్బందిని ఒకేచోటికి చేర్చి త్వరగా మరమ్మతులు చేసేందుకు ఈ విలేజ్ కరెంట్ ఆఫీసర్ల వ్యవస్థ ఉపయోగపడుతుందని సర్కార్ భావిస్తోంది.

స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు

రాష్ట్రంలో 30.33 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, 5.22 లక్షల డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు (DTR) ఉన్నాయి. రైతు డిస్కంకు ఈఆర్‌సీ లైసెన్స్ రాగానే.. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌పై రూ. 25 వేల చొప్పున, మొత్తం రూ. 1,306 కోట్లతో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలవనున్నారు. టెండర్ దక్కించుకున్న కంపెనీల ద్వారానే మీటర్ రీడింగ్, గ్రామాల్లో లైన్ల నిర్వహణ పనులు చేయించేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్లాన్ కూడా సిద్ధం చేస్తోంది. ఈఆర్‌సీ లైసెన్స్ మంజూరైన తర్వాతే ఏ ప్రణాళికతో ముందుకు వెళ్లాలనేది ఖరారు కానుంది.