Rythu Bharosa : రైతుభరోసా నిధులు మీబ్యాంక్ ఖాతాలో పడలేదా..? వెంటనే ఇలా చేయండి.. మీ ప్రాబ్లం క్లియర్..
Rythu Bharosa : వానాకాలం సీజన్కోసం రైతులకు రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రైతు బ్యాంక్ ఖాతాల్లో విడుదల చేశారు.
Rythu Bharosa funds credited to farmers bank accounts
Rythu Bharosa : సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంటల సాగు సమయంలో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. వానాకాలం సీజన్ కోసం రైతులకు రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు.
రైతు భరోసా పథకంలో భాగంగా మొదటి విడతలో రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 44.28 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02కోట్లు వెంటనే జమ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతులకు చెందిన కోటిన్నర ఎకరాలకు రూ.9వేలకోట్లు తొమ్మిది విడతల్లో అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
డబ్బులు పడ్డాయా…? లేదా? ఎలా చెక్ చేసుకోవాలి?
♦ ముందుగా.. https://rythubharosa.telangana.gov.in వెబ్ సైట్లోకి వెళ్లాలి.
♦ హోమ్ పేజీలో ‘Beneficiary Status’ లేదా ‘Payment Status’ అనే ఆప్షన్ ఎంచుకోండి
♦ ఆధార్ నెంబర్ లేదా పట్టాదారు పాస్ బుక్ నెంబర్ నమోదు చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
♦ మీకు డబ్బులు పడ్డాయా లేదా.. ఏ అకౌంట్లో పడ్డాయి.. ఎన్ని డబ్బులు పడ్డాయి అనే వివరాలు కనిపిస్తాయి.
డబ్బులు పడకుంటే ఇలా చేయండి..
♦ రైతుభరోసా పథకంలో భాగంగా వానాకాలం పంట సాగుకు సంబంధించి మొదటి విడతలో రెండు ఎకరాలు కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో సీఎం రేవంత్ రెడ్డి నిధులు జమ చేశారు.
♦ ఆ నిధులు బ్యాంక్ ఖాతాల్లో పడని రైతులు మండలం పరిధిలోని గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి. లేదంటే మండల వ్యవసాయ అధికారిని కూడా సంప్రదించవచ్చు.
♦ డబ్బులు పడకపోవడానికి గల కారణాలను తెలుసుకోండి. సమస్య ఎక్కడ ఉంది.. డబ్బులు ఎందుకు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదనే వివరాలను అధికారులు వెల్లడిస్తారు.
♦ ఆ తరువాత పట్టాదారు పాస్ బుక్లో, ఆధార్ కార్డు, బ్యాంక్ అంకౌట్లో పేరు ఒకేలా ఉందా.. లేదా అనేది చెక్ చేసుకోండి.
♦ పేరు తప్పుగా ఉంటే డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది.
♦ ఇక ఆధార్, మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వంటివి లింక్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోండి.
♦ సాంకేతిక సమస్యల వల్ల నగదు జమకాని రైతులు బ్యాంకు ఖాతాల నంబర్లతో పాటు ఐఎఫ్ఎస్సీ కోడ్ నంబర్లను సరిచేసుకోవాలి.
మరోవైపు.. రైతు భరోసా జాబితాలో ఇంకా పేరు నమోదు కాని వారికి కూడా ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జూన్ 15లోపు కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు లేదా ఇప్పటి వరకు పథకంలో రిజిస్టర్ చేసుకోని అర్హులైన రైతులు జూలై 5లోపు తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)కి అవసరమైన సర్టిఫికేట్లను సమర్పించి అప్లయ్ చేసుకోవచ్చు.
