Smart Ration Card : కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో ఇన్ని సెక్యూరిటీ ఫీచర్లా? కంటికి కనిపించని విధంగా.. ఇక నకిలీ కార్డులకు చెక్..!

Telangana Smart Ration Card : ప్రభుత్వం పంపిణీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులో అత్యాధునిక ఫీచర్లను పొందుపర్చారు.

Telangana Smart Ration Card

Telangana Smart Ration Card : తెలంగాణ ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న స్మార్ట్ రేషన్ కార్డు సాధారణ కార్డులకు పూర్తి భిన్నంగా ఉండనుంది. కేవలం లబ్ధిదారుల వివరాలు మాత్రమే కాకుండా.. నకిలీ కార్డులకు చెక్ పెట్టేలా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను ఇందులో పొందుపర్చనున్నారు. యాంగిల్ మార్చితే కనిపించే హిడెన్ ఇమేజెస్, UV లోగో, ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్, భూతద్దంతో మాత్రమే కనిపించే మైక్రో టెక్స్ట్ వంటి ప్రత్యేకతలు ఈ కార్డులో ఉన్నాయి. కార్డును తాకినా, స్కాన్ చేసినా అసలైనదో కాదో గుర్తించేలా సాంకేతికతను ఉపయోగించారు.

Also Read : Revanth Reddy: కరువు కోసం క్షుద్ర పూజలు.. దుర్మార్గులకు అష్టదిగ్బంధనం ఖాయం.. కూకట్‌పల్లిలో సీఎం సంచలన కామెంట్స్

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ స్మార్ట్ కార్డులను అందజేయనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన సంగారెడ్డి జిల్లాలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్డుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు.. కార్డు యాజమాని వివరాలు ఉంటాయి. అంతేకాక.. రేషన్ దుకాణం నంబరు, సివిల్ సప్లయ్స్ కమిషనర్ అధికారిక సంతకం ఉంటుంది.

స్మార్ట్ రేషన్ కార్డు ముందు, వెనుక భాగాల్లో స్పర్శ ద్వారా గుర్తించే, డిజిటల్‌గా ధ్రువీకరించే సెక్యూరిటీ ఫీచర్లను పొందుపరిచారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన సెక్యూర్ హోలోగ్రామ్, ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ తెలంగాణ’అనే పదాలను ఉబ్బెత్తుగా ముద్రించారు. చేతితో తడిమినప్పుడు ఈ అక్షరాలు స్పష్టంగా తెలుస్తాయి. సాధారణ ప్రింటింగ్ పద్ధతులతో వీటిని యథాతథంగా డూప్లికేట్ చేయడం కానీ, కాపీ చేయడం కానీ.. కష్టంగా ఉండేలా డిజైన్ చేశారు.

ప్రభుత్వం పంపిణీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులో అత్యాధునిక ఫీచర్లను పొందుపర్చారు. కార్డులో అత్యంత సూక్ష్మ పరిమాణంలో మైక్రో టెక్స్ట్‌ను ముద్రించనున్నారు. సాధారణంగా కంటికి స్పష్టంగా కనిపించని ఈ అక్షరాలు భూతద్దం ద్వారా పరిశీలించినప్పుడు మాత్రమే గుర్తించగలిగేలా ఉంటాయి. సాధారణ ప్రింటింగ్ యంత్రాలతో వీటిని డూప్లికేట్ చేయడం కష్టతరం. కార్డు బ్యాక్ గ్రౌండ్‌లో గిల్లోష్ ప్యాటర్న్ అనే సంక్లిష్ట రేఖా ఆకృతిని ఉపయోగించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన వాటర్ మార్క్ కార్డులో పొందుపర్చారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో డ్యూయల్ హిడెన్ ఇమేజెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ‘GOTG’ తదితర రహస్య గుర్తులు నిర్దిష్ట కోణంలో లేదా మాగ్నిఫికేషన్ ద్వారా మాత్రమే కనిపించేలా డిజైన్ చేశారు. దీంతో కార్డు ఒరిజినలా? నకిలీదా? అనే విషయాన్ని పరిశీలించేందుకు మరో భద్రతా ప్రమాణం అందుబాటులోకి వస్తుంది.

కార్డు వెనుక భాగంలో 20/20 మిల్లీ మీటర్ల పరిమాణంలో ఎన్‌క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. ఇందులో డిజిటల్‌గా సేఫ్టీ సమాచారాన్ని పొందుపరచి, అథరైజ్డ్ సాఫ్ట్‌వేర్ లేదా స్కానింగ్ వ్యవస్థల ద్వారా లబ్దిదారుల వివరాలను ధ్రువీకరించేలా వ్యవస్థను రూపొందించారు. డేటాలో అనధికార మార్పులు, డూప్లికేషన్, నకిలీ కార్డులు తయారీని అడ్డుకోవడం ఈ విధానం ప్రధాన ఉద్దేశం.