TG Registration Services : తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. కారణం ఇదే..
TG Registration Services : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.
- Harish Thanniru
- Published on- June 30, 2026 / 01:58 PM IST
Telangana Registration Server Down
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్..
- సాంకేతిక లోపాలతో పనిచేయని ప్రధాన సర్వర్లు
- ఇబ్బందులు పడుతున్న క్రయవిక్రయ దారులు
TG Registration Services : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన సర్వర్లు గత రెండు రోజులుగా పనిచేయకపోవడంతో భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో స్లాట్ బుకింగ్ లు, చలాన్ చెల్లింపులు, ఈ-కేవైసీ వంటి ఆన్ లైన్ సేవలు స్తంభించగా.. ప్రజలు గంటల తరబడి కార్యాలయాల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ప్రధాన సర్వర్లు మొరాయించడంతో భూములు, ఇళ్లు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత రెండు రోజులుగా నిలిచిపోయింది. గత మూడు నెలల వ్యవధిలో సాంకేతిక లోపాల కారణంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోవడం ఇది నాల్గోసారి కావడంతో ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్వర్లు పనిచేయకపోవడంతో కొత్త స్లాట్ బుకింగ్ లు, చలాన్ చెల్లింపులు, ఈ కేవైసీ ధ్రువీకరణ వంటి కీలక ఆన్‌లైన్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా నిలిచిపోయినట్లు చెబుతున్నారు. ముందుగానే ముహూర్తాలు నిర్ణయించుకుని స్లాట్‌లు బుక్ చేసుకున్న క్రయ, విక్రయదారులు సాక్షులతో కలిసి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చేరుకున్నప్పటికీ పనులు జరగక తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
మరోవైపు.. క్షేత్రస్థాయి అధికారులకు కూడా ఈ సమస్యపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో వారు ప్రజలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సమస్యను పరిష్కరించి, సర్వర్లను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి రాష్ట్ర స్థాయి సాంకేతిక బృందం చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే సేవలు పూర్తిగా ఎప్పుడు పునరుద్ధరించబడతాయనే అంశంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
