Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..
Telangana Govt : తెలంగాణలో విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Telangana Govt
Telangana Govt : తెలంగాణలో విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు విద్యా సంస్కరణలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
విద్యాశాఖపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త విధానంలో నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రాథమిక విద్య, ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు సెకండరీ విద్య, తొమ్మిది నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యగా విభజించాలని సూచించారు.
పదో తరగతి తర్వాత చాలామంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని, ముఖ్యంగా బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పిల్లలు ఎక్కువగా చదువుకు దూరమవుతున్నారని సీఎం పేర్కొన్నారు. 12వ తరగతి వరకు విద్య కొనసాగించే కేంద్రీయ, నవోదయ, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో డ్రాపౌట్స్ తక్కువగా ఉన్నాయని తెలిపారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉందన్నారు.
12వ తరగతి పూర్తయ్యే నాటికి విద్యార్థులకు భాషా, సమాచార నైపుణ్యాలపై పూర్తి పట్టు ఉండాలని, ఆ తర్వాత ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం సాధించేలా అవకాశాలు కల్పించాలని సూచించారు. కొత్త విధానంతో జూనియర్ కాలేజీల లెక్చరర్లు, సిబ్బందికి ఉద్యోగ, పదవీ విరమణ ప్రయోజనాల్లో ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చారు. మరోవైపు సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు అద్దె భవనాల్లో ఉండకూడదని, అన్ని సౌకర్యాలతో సొంత భవనాలు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.
ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడంతో ప్రవేశాలు పెరిగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్‌ల ఆధునీకరణకు నిధులు విడుదల చేయాలని అన్నారు. యూనివర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ఇతర ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
