Tammidikunta Lake Inauguration: నాగార్జున రియల్ హీరో.. తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవంలో సీఎం ప్రశంసలు.. రూ.20 కోట్లతో అద్భుతంగా..!
మాదాపూర్లో రూ.20 కోట్లతో సర్వాంగ సుందరంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును(Tammidikunta Lake Inauguration) సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటుడు అక్కినేని నాగార్జున కలసి ప్రారంభించారు.
Cm revanth reddy and actor nagarjuna inaugurate redeveloped tammidikunta lake in madhapur
Tammidikunta Lake Inauguration: హైదరాబాద్ మాదాపూర్ పరిధిలోని తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణను ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ, సినీ నటుడు అక్కినేని నాగార్జున నిజ జీవితంలోనూ హీరోలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. బుధవారం సాయంత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తమ్మిడికుంట (Tammidikunta Lake Inauguration)చెరువును నాగార్జునతో కలిసి సీఎం ప్రారంభించారు. హైదరాబాద్ చుట్టూ ఎన్నో సహజసిద్ధమైన చెరువులు ఉన్నాయని, భవిష్యత్ తరాల మేలు కోసం కఠినమైన పర్యావరణ నిర్ణయాలు తప్పవని సీఎం పేర్కొన్నారు. చెరువు విస్తరణ కోసం నాగార్జున ఉదారంగా రెండు ఎకరాల స్థలాన్ని అందించడాన్ని అభినందిస్తూ ఆయనను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సత్కరించారు.
రూ.20 కోట్లతో తమ్మిడికుంట పునరుద్ధరణ.. అద్భుతంగా తీర్చిదిద్దారన్న అక్కినేని నాగార్జున:
మొత్తం రూ.20 కోట్ల వ్యయంతో హైడ్రా (HYDRAA) ఆధ్వర్యంలో 14 ఎకరాల నుంచి 30 ఎకరాలకు విస్తరించిన తమ్మిడికుంట చెరువు పరిధిలో పూడికతీత పనులతో పాటు 1.6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియాలను అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. విదేశాల్లోని సరస్సులను చూసి మన దగ్గర కూడా ఇలా ఉంటే బాగుండని అనుకునేవాడినని, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డిల దృఢ సంకల్పంతో తమ్మిడికుంట అద్భుతంగా రూపుదిద్దుకుందని ఆనందం వ్యక్తం చేశారు. మన పిల్లలకు ఇచ్చే అతిపెద్ద ఆస్తి ప్రకృతి మాత్రమేనని, తమ్మిడికుంట వద్ద త్వరలోనే షూటింగ్ నిర్వహిస్తానని స్పష్టం చేశారు.
బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు.. మూసీ పునర్జీవనంపై సీఎం రేవంత్ రెడ్డి పిలుపు:
చెరువు ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఇళ్లను కోల్పోయిన పేదలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇళ్ల నివేదన పత్రాలను ఈ కార్యక్రమంలో సీఎం అందజేశారు. మానవాళి నీటి ఆవాసాలను ఆక్రమిస్తే ప్రకృతి తిరగబడుతుందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వందేళ్ల క్రితమే మూసీ రివర్ ఫ్రంట్ నాగరికత హైదరాబాద్కు గుర్తింపు తెచ్చిందని, రాబోయే రోజుల్లో మూసీ నదిని కూడా ఇదే రీతిలో ప్రక్షాళన చేసి ప్రపంచస్థాయి పునర్జీవనం కల్పిస్తామని ఆయన ప్రకటించారు.
